నకిలీ శానిటైజర్ల విక్రయ గ్యాంగులు.. రాష్ట్రాలకు సిబిఐ హెచ్చరికలు
న్యూఢిల్లీ : కరోనా క్లిష్ట దశలో నకిలీ హ్యాండ్ శానిటైజర్లు అమ్మే ముఠా ఒకటి వెలుగులోకి వచ్చింది. మిథనాల్‌ను ఆధారంగా చేసుకుని నకిలీ సానిటైజర్లు చేసి అమ్ముతున్నారని ఇంటర్‌పోల్ వివిధ దేశాలకు సమాచారం అందించింది. దీనితో సిబిఐ వెంటనే వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు వెలువరించింది. అత్యంత ప్రమాదకరమైన మిథనాల్‌తో వీటిని తయారు చేస్తున్నారు.
అందే విధంగా పిపిఇలు, ఇతర కోవిడ్ వైద్య చికిత్సల సామాగ్రి పేరిట కూడా కొన్ని ముఠాలు రంగంలోకి దిగాయి. ప్రజలకు వీటిని విక్రయించేందుకు యత్నిస్తున్నారని, ఈ నకిలీల ముఠాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సిబిఐ హెచ్చరించింది. ఈ గ్యాంగ్‌ల విషయంలో సరైన నిఘా పెట్టాలని, వారి కదలికలను గుర్తించి నకిలీ గ్యాంగ్‌లు రంగంలోకి రాకుండా చూడాలని తెలిపారు. క్లిష్ట పరిస్థితి నడుమ తేలిగ్గా డబ్బు సంపాదన మార్గాలకు దిగేవారు ముఠాలుగా ఏర్పడ్డారని పేర్కొన్నారు. కోవిడ్ నివారణకు అవసరమైన కిట్లు, ఇతర పరికరాల కొరత ఉండటంతో దీనిని ఆధారంగా చేసుకుని గ్యాంగ్‌లు రంగంలోకి దిగాయి.