ఏటీఎంలో జమచేయాల్సిన నగదును దోచుకున్న నిందితుల అరెస్ట్

39 లక్షల నగదు, 2 మోటార్ సైకిళ్ళు, 4 సెల్ఫోన్ల స్వాధీనం

కేసు వివరాలను వెల్లడించిన అర్బన్ ఎస్పీ R.N. అమ్మిరెడ్డి

గుంటూరు

ఏటీఎంలో నగదు జమచేయాల్సిన సిబ్బందే…పథకం ప్రకారం నగదు కాజేసి కటకటాల పాలయ్యారు. ఈ నెల 9వ తేదీన గుంటూరు అమరావతి రోడ్డులో ఏటీఎం వద్ద నగదు జమచేసినట్లు నటించి 39 లక్షలతో పథకం ప్రకారం ఉడాయించారు. ఈ మేరకు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి ఎస్పీ ఆర్.ఎన్ అమ్మిరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. అనంతరం కేసును చేధించడంలో చొరవ చూపిన సిబ్బందికి ఎస్పీ తన చేతుల మీదుగా రివార్డులను అందజేశారు. నేర విభాగం అడిషనల్ సూపరింటెండెంట్ ఎస్.మనోహరరావు, సీసీఎస్ డీఎస్పీ కె.ప్రకాష్, సౌత్ డీఎస్పీ ఎం.కమలాకర్, సీసీఎస్ ఇన్సెపెక్టర్ బి.శ్రీనివాసరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

కేసుకు సంబంధించిన వివరాలు

రైటర్స్ సేఫ్ గార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నందు ప్రవీణ్ మరియు నాగేంద్రబాబు అను వారలు కస్టోడియన్స్ గా, భోజారావు గన్ మెన్ గా, తిరుపతిరావు క్యాష్ వాహనం డ్రైవర్ గా పని చేయు చున్నారు. అందరూ కలిసి వివిధ బ్యాంకుల నుండి డబ్బులు తీసుకొని ఆయా బ్యాంకుల ఏటీఎం లలో క్యాష్ ను లోడ్ చేస్తూ ఉంటారు. 

వారు వాహనంలో ప్రయాణం చేసిన దూరమును బట్టి వారికి అలవెన్స్ వస్తుంది. ఈక్రమంలో లాక్ డౌన్‌ సమయంలో ఏటీఎం లలో డబ్బులు పెట్ట నందున వారికి మైలేజీ రాలేదు.

కానీ డ్రైవర్ తిరుపతిరావు వాహనములో ఎక్కువ దూరం ప్రయాణం చేసినట్టుగా ట్రావెల్లింగ్ అలవెన్సు వ్రాసినాడు. దానిపై కస్టోడియన్లు సంతకం పెట్టాలి. అందువలన నాగేంద్ర బాబు సంతకం పెట్టాడు కానీ ప్రవీణ్ ఓప్పు కోకుండా సంతకం పెట్టలేదు.

ఈ విషయం గురించి రూటు లీడర్ దుర్గా ప్రసాద్ గారు నాగేంద్రబాబును క్రాస్ చెక్ చేశాడు. ఆ తరువాత వారు క్యాష్ లోడింగ్ కు వెళ్ళి నప్పుడు 2020 మే నెలలో కరూర్ వైశ్యా బ్యాంక్ వద్ద తిరుపతిరావు, గన్ మెన్ భోజారావు మరియు కస్టోడీయన్ నాగేంద్రబాబు అనువారు ప్రవీణ్ పై గొడవ పడినారు.

డ్రైవర్ తిరుపతిరావు మరియు గన్ మాన్ భోజారావు ల మాట ప్రవీణ్ వినలేదని, అతనిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఎలాగైనా ప్రవీణ్ డ్యూటీ లో ఉన్నప్పుడు వ్యాన్ లోని డబ్బులు కాజేయాలని అనుకొని, దొంగతనం చేసిన తరువాత ఆ డబ్బును అందరూ పంచుకుని, ఆ డబ్బులు ప్రవీణ్ తో కట్టించాలని కుట్రపన్ని, అనంతరం వెంకట నాగేంద్ర బాబు తనకు పరిచయస్తులైన మరియు తన గ్రామానికి చెందిన నాగ వెంకట సాయి మరియు కంపనాటి గంగాధర్ అను వారిని భోజారావు మరియు తిరుపతిరావు లకు పరిచయం చేసినాడు. 

తిరుపతిరావు వారితో మాట్లాడి దొంగతనం ఎలా చేయాలో చెప్పి, వారు వేసుకున్న పధకం ప్రకారం ది.09-06-20 వ తేదీన ఉదయం నాగ వెంకట సాయి మరియు కంపనాటి గంగాధర్ అను వారిని గుంటూరులోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉండమని, వ్యాన్ డోరును గట్టిగా లాగమని,  డ్రైవర్ తిరుపతిరావు వారికి చెప్పి, వారి పథకంలో భాగంగా ఆరోజు గన్ మాన్ భోజారావు మరియు నాగేంద్రబాబు అనువారు, వారి సొంత పనులపై వెళ్లి, మధ్యాహ్నం సుమారు గం.2:30 ని.ల సమయంలో వాహనం నగరాలు లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్దకు రాగా, ముందు అనుకున్న పథకం ప్రకారం ప్రవీణ్ మరియు డ్రైవర్ తిరుపతిరావు లు డోరు సరిగా వేయకుండా బ్యాంకు లోనికి వెళ్లగా, నాగ వెంకట సాయి మరియు గంగాధర్ లు క్యాష్ వ్యాను వద్దకు వచ్చి, వ్యాన్ లోని 39 లక్షల రూపాయలు ఉన్న బాక్స్ ను దొంగిలించుకుని పోయి, అక్కడినుండి మోటార్ సైకిల్ పైన నవులూరు వెళ్ళి పోయారు. 

ఈరోజు అనగా 19-06-20 వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకు గుంటూరు అర్బన్ ఎస్పీ శ్రీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి, ఐపీఎస్., వారి పర్యవేక్షణలో అడిషనల్ ఎస్పి క్రైమ్స్ ఎస్ మనోహరరావు గారి సారధ్యంలో, సిసిఎస్ డిఎస్పి ప్రకాష్ బాబు, సౌత్ డిఎస్పి ఎం కమలాకరరావు, సిసిఎస్ సిఐ బి శ్రీనివాసరావు, నల్లపాడు సిఐ కె వీరస్వామి, ఎస్సై విశ్వనాథ రెడ్డి మరియు సిబ్బంది సదరు నిందితులు

1) సోళ్ల వెంకట నాగేంద్రబాబు 23 సం.లు, నవులూరు, మంగళగిరి మండలం, 

2)  రాజబోయిన వెంకట నాగ శివ, 23 సం.లు, నవులూరు, మంగళగిరి మండలం,

3) కంపసాటి గంగాధర్, 21 సం.లు, నవులూరు, మంగళగిరి మండలం,

4) ఉల్లం తిరుపతిరావు, 31 సం.లు,  శ్రీశైలంకాలనీ, వెంగలయపాలెం, గుంటూరు రూరల్ మండలం,

5) ఉల్లంగుల భోజారావు, 39 సం.లు, హిమని నగర్, నగరాలు, అమరావతి రోడ్, గుంటూరు మండలం. 

అనువార్లను నవులూరు లోని సోళ్ల వెంకట నాగేంద్ర బాబు ఇంటి వద్ద అరెస్టు చేసి, వారి వద్ద నుండి చోరీ సొత్తును 39,00,000/- రూపాయలు మరియు రెండు మోటార్ సైకిల్స్, నేరం చేయుటకు ఉపయోగించిన నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినారు.

ఈ కేసు చేదనలో పనిచేసిన సిబ్బంది , అధికారులకు విలేకర్ల సమావేశంలో ఎస్పీ గారు రివార్డ్స్ అందజేశారు.

ఈ సందర్భంగా గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి, ఐపీఎస్., గారు మాట్లాడుతూ, ఈ కేసు జరిగినప్పటి నుండి నల్లపాడు పోలీస్ వారు, సిసిఎస్ సిబ్బంది, IT కోర్ టీం సహకారంతో తీవ్ర కృషివల్ల పోయిన నగదు మొత్తాన్ని పట్టుకోవడం జరిగిందని, ఈ విధమైన క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉండే ఇలాంటి ఏటీఎం లలో నగదును  లోడ్ చేసే సంస్థలు మరియు బ్యాంకు నుండి బ్యాంకు నకు నగదు తీసుకువెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బ్యాంకుల వారు కొన్ని సందర్భాల్లో పోలీసువారి ఎస్కార్ట్ కోరతారని, కొన్ని సందర్భాల్లో వారి సొంత భద్రతతో తరలిస్తున్నారని, ఈ సందర్భంలో ఉపయోగించే సెక్యూరిటీ సిబ్బందిని తీసుకునే సమయంలో తగిన విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వారి పూర్వాపరాలను పరిశీలించిన అనంతరమే వారిని వినియో గించాలని, కేవలం తీసుకునేటప్పుడే కాకుండా, సంవత్సరానికి లేక ఆరు నెలలకు ఒకసారి, వారి ప్రవర్తన / పరిస్థితులు తెలుసుకొని, ముఖ్యమైన విధులకు వినియోగించాలని, ఈ విధమైన కీలకమైన విధులలో ఉపయోగించే వారి పరిస్థితులు, పూర్వాపరాలు గురించి విచారించేందుకు పోలీస్ శాఖలో  ₹1000 చలానా చెల్లించినట్లైతే, విచారించి సమాచారం ఇవ్వటం జరుగుతుందని, కనుక బ్యాంకుల వారు / సంస్థల వారు / ప్రజలు అప్రమత్తతో ఉండాలని, ఎక్కువ మొత్తంలో నగదు తీసుకుని వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలియ జేశారు.

About The Author