ఇకపై ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 7.00 వరకు మాత్రమేసరిహద్దు వద్ద వాహనాల అనుమతి

నల్లగొండ : నల్లగొండ జిల్లా మీదుగా ఆంధ్రప్రదేశ్ వెళ్లాలనే ప్రయాణికులు  ఇకపై ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 7.00 వరకు మాత్రమే సరిహద్దు వద్ద వాహనాల అనుమతించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నల్లగొండ నుండి ఏ.పి.లోకి వెళ్లే అన్ని వాహనాలను సాయంత్రం 7.00 తర్వాత ఆంధ్రా సరిహద్దులలో నిలిపివేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ తెలిపారని అందువల్ల ప్రయాణికులు అందుకు అనుగుణంగా ప్రయాణించాలని రంగనాధ్ కోరారు. 7.00 గంటల తర్వాత ఆంధ్రా సరిహద్దులకు వెళ్లి ప్రయాణికులు ఇబ్బందులు పడవద్దని ఆయన సూచించారు. ఇక ఇదే సమయంలో నల్లగొండ జిల్లా మీదుగా మాచర్లకు వెళ్లే మార్గంలో ఉన్న నాగార్జున సాగర్ – మాచర్ల రోడ్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రోడ్డుగా గుర్తించనందున ఆ మార్గంలో ఎలాంటి ప్రజా రవాణా, వాహనాలను ఏ.పి. పోలీసులు అనుమతించడం లేదని ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.

*పాస్ ఉంటేనే ఏ.పి.లోకి అనుమతి*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సరుకు రవాణా, అత్యవసర సేవల వాహనాలు మినహా మిగిలిన అన్ని ప్రైవేట్ వాహనాలలో ప్రయాణించే వారికి విధిగా పాస్ ఉండాలని, పాస్ లేకుండా ప్రయాణాన్ని వారు అనుమతించడం లేదని అందువల్ల ప్రయాణికులు ఆంధ్రాకు వెళ్లే సమయంలో విధిగా పాసులు సంబంధిత అధికారుల నుండి తీసుకుని ప్రయాణం చేయాలని జిల్లా ఎస్పీ రంగనాధ్ సూచించారు.

About The Author