అన్‌లాక్ 2.0 ఇలా ఉండబోతోంది…
కరోనా కట్టడిలో భాగంగా భారత ప్రభుత్వం విధించిన లాక్డౌన్లు ముగిసిపోయాయి. ఇప్పుడు క్రమంగా సడలింపులు ఇస్తూ అన్‌లాక్ చేస్తోంది ప్రభుత్వం. అఖిలపక్ష సమావేశంలోనూ ప్రధాని నరేంద్ర మోడీ దశలవారీ లాక్డౌన్ ముగిసిందని.. ఇప్పుడు అన్‌లాక్ ప్రక్రియ మొదలైందని క్లారిటీ ఇచ్చారు. అప్పటి వరకు మళ్లీ లాక్డౌన్ అంటూ జరుగుతోన్న ప్రచారానికి తెరదించారు. ఇక, జూన్ 30వ తేదీతో అన్‌లాక్ 1 ముగియనుండగా అన్‌లాక్ 2.0 ప్రారంభం కానుంది. ఈ తరుణంలో ఎలాంటి సడలింపులు ఉంటాయనే చర్చ ఆసక్తిగా సాగుతోంది. మరోవైపు రుతుపవనాలు విస్తరిస్తుంచడంతో త్వరలో ప్రకటించబోయే అన్‌లాక్ 2 మార్గదర్శకాల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు అనే చర్చ కూడా నడుస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లకు మరికొన్ని రోజులు అనుమతులు ఉండకపోవచ్చు అని ఓ అధికారి వెల్లడించారు. దేశవ్యాప్తంగా దాదాపు 85 శాతం కరోనా కేసులు నగరాల్లోనే నమోదవుతోన్న సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకునే దిశగా కేంద్రం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఇప్పుడు ఎలాంటి వాటికి అనుమతి ఇస్తారు అనే చర్చ కూడా సాగుతోంది. అన్‌లాక్ 2లో అంతర్జాతీయ విమాన సర్వీసులు పున: ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జూలై 15వ తేదీ వరకు అంతర్జాతీయ విమానసర్వీసులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ కొన్నింటిని “కేస్-టు-కేస్” ప్రాతిపదికన అనుమతించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం కొన్ని ప్రత్యేక విమానాలను మాత్రం నడుపుతోన్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా అన్‌లాక్ 2లో మాత్రం పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తిరిగి తెరిచే అవకాశం ఉండబోదు అంటున్నారు. సీనియర్ అధికారులు అన్‌లాక్ 2.0 మార్గదర్శకాల పెద్దగా మార్పు ఉండకపోవచ్చు అని చెబుతున్నారు. అయితే, కర్ఫ్యూ సమయాల్లో కొన్ని మార్పులు ఉండే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ఇక, కరోనా కేసులు పెరుగుతుండడంతో కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛందంగా లాక్డౌన్ నడుస్తోంది… హోల్‌సెల్ మార్కెట్లను వ్యాపారులే మూసివేయాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభుత్వం సడలింపులు ఇచ్చినా.. కేసుల తీవ్రత పెరగడం సరైన బిజినెస్ కూడా సాగకపోవడంతో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.