ఆస్తుల పరిరక్షణకు జీహెచ్ఎంసీ టోల్‌ఫ్రీ నంబర్…సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యం: కేటీఆర్
హైదరాబాద్: భాగ్యనగరంలో ఆస్తుల పరిరక్షణకు జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. పార్కులు, చెరువులు, బహిరంగ స్థలాల పరిరక్షణకు ‘అసెట్ ప్రొటెక్షన్ సెల్’ *టోల్‌ఫ్రీ నంబర్ 1800 599 0099ను ఏర్పాటు చేశారు*. జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, విపత్తు నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ నంబర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నగరంలో ఆస్తుల రక్షణపై టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. చెరువులు, బహిరంగ స్థలాలు, పార్కుల రక్షణపై ఫిర్యాదు చేయాలి. అన్ని పని దినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6గంటల వరకు టోల్‌ఫ్రీ పనిచేస్తుంది. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. చెరువులు, పార్కులు, స్థలాల రక్షణకు ప్రభుత్వంతో కలిసి రావాలి. ప్రతి ఫిర్యాదుకు ప్రత్యేకంగా విశిష్ట సంఖ్య కేటాయిస్తాం. ఈ సంఖ్య ఆధారంగా ఫిర్యాదు పురోగతిని తెలుసుకొనే వీలుంటుంది. జీహెచ్ఎంసీ పరిధి జోన్లు, సర్కిళ్లలో అధికారిని నియమించాం’’ అని తెలిపారు.