ఇంటి పేరు క్లిక్.. ఇళ్లు తళుక్కు
కర్ణాటక:బెంగళూరుకు చెందిన ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ తన ఇంటిని కేమెరాలా నిర్మించాడు. ఇంటి పేరు ‘క్లిక్’ అని నామకరణం చేశారు. ముగ్గురు కొడుకులకు కెమెరా పేర్లు పెట్టాడు.
కొందరికి రేడియో వినడం అంటే ఇష్టం..మరికొందరికి పాటలంటే ఇష్టం..ఇంకొకరికి వంటల పిచ్చి….ఇంకా సంగీతం, నృత్యం ఇలా రకరకాల కళల్లో ఎవరి అభిరుచి వారికి ఉంటుంది. ఆ ప్రతిభతో ఆయా రంగాల్లో రాణించిన పేరు ప్రఖ్యాతులు గడించిన వారు చాలామందే ఉన్నారు. అయితే ఆ ప్రేమ కాస్త పిచ్చిగా మారి, దాన్ని చాలా భిన్నంగా, హృద్యంగా మల్చుకోవడం దాదాపు అరుదు అనే చెప్పాలి.కర్ణాటకలోని బెల్గాంకు చెందిన రవి హోంగల్ (49) ఇదే కోవకు చెందుతారు. చిన్నప్పటి నుంచీ ఆయనకు ఫోటోగ్రఫీపై మక్కువ ఎక్కువ. అలా ‘పెంటాక్స్’ కెమెరాతో కనిపించిన దృశ్యాలను క్లిక్ చేస్తూ ఎదిగారు. చివరికి దాన్నే వృత్తిగా ఎంచుకుని తన భార్య రాణితో కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. అంతేకాదు ప్రముఖ డిజిటల్ కెమెరాలు ఎప్సన్, కానన్, నికాన్ పేర్లను తన ముగ్గురు కుమారులకు పెట్టారు. ఇక్కడితో అయన అభిమానం ఆగిపోలేదు. కెమెరా ఆకారంలో బెల్గావ్లో మూడంతస్థుల భవనాన్ని నిర్మించుకోవడం విశేషం. సుమారు 71 లక్షల రూపాయలతో ప్రేమగా నిర్మించుకున్న తన కలల సౌధానికి ‘క్లిక్’ అని పేరు పెట్టుకోవడం మరో విశేషం