రైల్వే అండర్ బ్రిడ్డి కింద నీటిలో చిక్కుకున్న బస్సు..
న్యూఢిల్లీ: రైల్వే అండర్ బ్రిడ్డి కింద నీటిలో ఒక బస్సు చిక్కుకోగా అందులోని డ్రైవర్ మునిగి మృతి చెందాడు. ఢిల్లీలోని మింటో ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా నీరు నిలిచిపోయింది. ఆదివారం ఉదయం ఆ నీటిలో ఒక బస్సు చిక్కుకుపోయింది. అనంతరం ఆ బస్సు ముందు నీటిపై తేలుతున్న ఒక మృతదేహాన్ని రైల్వే ట్రాక్మాన్ రామ్నివాస్ మీనా చూశారు. వెంటనే ఈదుకొంటూ వెళ్లి ఆ మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. కాగా, చనిపోయిన వ్యక్తిని కుందన్గా గుర్తించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆయన బస్సు డ్రైవర్ అని, ఉదయం నీట మునిగిన వంతెన కింద నుంచి బస్సును నడిపేందుకు ప్రయత్నించారని చెప్పారు.ఈ క్రమంలో బస్సు నీటిలో చిక్కుకుపోవడంతో 60 ఏండ్ల డ్రెవర్ కుందన్ మునిగి చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.