తెలంగాణలో వెర స్మార్ట్ హెల్త్ , (i MASQ) టెక్నాలజీ తో తయారు చేసిన బస్సులు..


కరోనాపై మొదటి రోజు నుండి యుద్దం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు మరో అడుగు ముందుకు వేసింది. ప్రజల ముంగిటకు వెళ్లి కరోనా పరీక్షలు చేయడమే కాదు అత్యవసర పరిస్థితి ఉన్నవారిని వెంటిలేటర్ సదుపాయం గల అంబులెన్స్ లో హాస్పిటల్స్ కి తరలించేందుకు “వెర” VERA స్మార్ట్ హెల్త్ తో కలిసి పనిచేయనుంది. వెర స్మార్ట్ హెల్త్ , “ఇంటెలిజెన్స్ మానిటరింగ్ అనాలసిస్ సర్వీస్ క్వారెంటైన్” (i MASQ) టెక్నాలజీ తో తయారు చేసిన బస్సులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు ఈరోజు కోఠి లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పరిశీలించి ప్రారంభించారు.

ఇందులో వెంటిలేటర్ సదుపాయం గల చిన్నపాటి ICU ఉంది. వీటితోపాటు ఆక్సిజన్ సదుపాయం గల 4 బెడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వీటి ద్వారా సుదూర ప్రాంతాల నుంచి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషంట్ ను పెద్ద ఆసుపత్రులకు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది.

ప్రజల ముంగిటనే పరీక్షలు చేయడమే ప్రధాన లక్ష్యంగా వెర సంస్థ 20 బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ బస్సులో 10 కలెక్షన్ కౌంటర్లు ఉంటాయి. పదిమంది టెక్నీషియన్స్ బస్సు లోపల ఉండి బయట ఉన్న వ్యక్తి గొంతు లేదా ముక్కు నుండి నమూనా సేకరిస్తారు. కంటైన్మెంట్ ఉన్న ప్రాంతాల్లో, కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ బస్సును తీసుకెళ్లి అనుమానితుల అందరికీ వెంటవెంటనే పరీక్షలు చేయడానికి అవకాశం ఉంది. ఈ బస్సు ద్వారా ఆర్టి పిసిఆర్ టెస్ట్ చేయడానికి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. 20 బస్సులకు అనుసంధానంగా 20 అంబులెన్సులు కూడా అందుబాటులో ఉంటాయి.
అత్యవసర పరిస్థితి ఉన్నా పేషెంట్లను ఆక్సిజన్ సదుపాయం గల అంబులెన్సుల్లో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించవచ్చు. ఈ అంబులెన్స్ లో ఏ ఏ హాస్పిటల్ లో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయి అని తెలుసుకొనే టెక్నాలజీ కూడా ఉండటం వల్ల, బెడ్స్ అందుబాటులో ఉన్న హాస్పిటల్ కి పేషెంట్లను తీసుకు వెళ్లడం ద్వారా వారి ప్రాణాలు కాపాడవచ్చును. దీని ద్వారా గోల్డెన్ అవర్ ను పోకుండా చూస్తామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.ఈ బస్సులను ప్రారంభించిన సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో ఎక్కువ మందికి పరీక్షలు చేయడం ద్వారా ప్రాణాలు పోకుండా కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రతి రోజు 15-16 వేల పరీక్షలను చేస్తుంది అని అన్నారు. వీటికితోడు VERA సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చిన 20 బస్సుల ద్వారా పరీక్షల సంఖ్య మరింత పెరగనుందని అన్నారు. అది కూడా కంటోన్మెంట్ జోన్స్ ఉన్న ప్రాంతాలకు నేరుగా వెళ్లి పరీక్షలు చేయడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మందిని త్వరితగతిన గుర్తించే అవకాశం లభించనుందని తెలిపారు. త్వరగా గుర్తిస్తే ప్రాణాలు నిలబెట్టవచ్చు అని మంత్రి అన్నారు. 80 శాతం మందిలో పాజిటివ్ ఉన్నా కూడా ఎలాంటి లక్షణాలు ఉండవు. వారందరూ ఇంట్లోనే ఉండవచ్చు. వీరిని 104 ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. వీరికోసం హితం అనే ఆప్ ను కూడా ప్రవేశపెట్టబోతున్నం. దీనిద్వారా రిటైర్డ్ డాక్టర్స్ తో సలహాలు ఇప్పిస్తాం అని మంత్రి అన్నారు.

15 శాతం మందికి కొంత చికిత్స అవసరం ఉంటుంది. వీరికి హాస్పిటల్ లో ఉచిత చికిత్స అందిస్తున్నాము. వీరిలో దాదాపు అందరు కోలుకుని ఇంటికి వెళ్తున్నారు. 5 శాతం మందికి మాత్రం ఆక్సిజీన్, వెంటిలేటర్ అవసరం ఉంటుంది. వీరికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో REMEDESWIR లాంటి ఇంజెక్షన్లు ఇచ్చి కాపాడే ప్రయత్నం చేస్తున్నాం అని మంత్రి తెలిపారు.ప్రస్తుతం 1100 స్వాబ్ కలెక్షన్ సెంటర్స్ లో పరీక్షలు చేస్తున్నాం. కంటెన్మెంట్ జోన్స్ లో పరీక్షలు చేయడానికి వెరా అందించిన బస్సులను వినియోగించనున్నామని మంత్రి ఈటల రాజేందర్ గారు తెలిపారు. కరోనా కట్టడి లో భాగంగా అన్ని చర్యలు తీసుకుంటాం. దీనికోసం కష్టపడుతున్న ప్రతి డాక్టర్, నర్స్, సిబ్బందికి అభినందనలు తెలుపుతున్నాను అని మంత్రి అన్నారు. ప్రాణాల కంటే డబ్బులు ఎక్కువ కావు కానీ ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తున్న సిబ్బంది త్యాగాన్ని గమనించాలని కోరారు. ఇలాంటి సమయంలో వారి మనో ధైర్యం దెబ్బతీయవద్దని పార్టీ నేతలను కోరుతున్నాను అని మంత్రి అన్నారు. 20 బస్సులు, 20 అంబులెన్స్ లు అందించేందుకు ముందుకు వచ్చిన VERA సంస్థ సీఈఓ దర్మతెజ, సీఓఓ విజయ లను మంత్రి అభినందించారు.

About The Author