మోదీ కి అరుదైన ఘనత…


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం మరో అరుదైన మైలురాయి అధిగమించారు. కాంగ్రెసేతర ప్రధానిగా అత్యధిక కాలం పనిచేసిన ఘనతను మోదీ అందుకున్నారు. అటల్‌ బిహార్‌ వాజ్‌పేయి పలుమార్లు ప్రధానిగా 2268 రోజులు వ్యవహరించగా మోదీ ఆ రికార్డును చెరిపివేశారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌ల తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా వ్యవహరించిన ఘనతను నరేంద్ర మోదీ సొంతం చేసుకున్నారు. మోదీ దేశ 14వ ప్రధానమంత్రిగా 2014 మే 26న ప్రమాణస్వీకారం చేయగా, 2019, మే 30న రెండోసారి కీలక బాధ్యతలను చేపట్టారు.

భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ 17 సంవత్సరాల పాటు అత్యున్నత పదవిని చేపట్టి దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా వ్యవహరించిన రికార్డు సాధించారు. ఈ తర్వాత పలుమార్లు ప్రధానిగా గద్దెనెక్కిన నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ 16 సంవత్సరాల పాటు ప్రధానిగా దేశానికి దిశానిర్ధేశం చేశారు. ఆపై మన్మోహన్‌ సింగ్‌ వరుసగా ఐదేళ్లపాటు రెండు సార్లు ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టారు. ఇక మరో రెండు రోజుల్లో ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేయనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో అత్యధిక కాలం ప్రధాని పగ్గాలు చేపట్టిన నాలుగో నేతగా అరుదైన ఘనతను సాధించారు. నెహ్రూ తర్వాత ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన అనంతరం తిరిగి మరోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టింది మన్మోహన్‌ సింగ్‌, నరేంద్ర మోదీలే కావడం గమనార్హం.

About The Author