సుందరకాండ అఖండ పారాయణంతో పులకించిన తిరుమలగిరులు…
ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం ఉదయం జరిగిన సుందరకాండలోని అష్టమ సర్గ నుంచి ఏకాదశః సర్గ వరకు ఉన్న మొత్తం 182 శ్లోకాలను దాదాపు 200 మంది వేద పండితుల అఖండ పారాయణంతో తిరుమలగిరులు పులకించాయి.
ఈ సందర్భంగా రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య మురళిధర్ శర్మ మాట్లాడుతూ వాల్మీకి మహర్షి రచించిన రామయణంలోని సుందరకాండలో నాయకుడు హనుమంతుడని తెలిపారు. హనుమంతుడిని స్మరించడం వలన బుద్ధి, బలం, దైర్యం, భయం లేక పోవడం, సఖల జీవులు ఆయురారోగ్యాలతో ఉంటాయన్నారు. టిటిడి సుందరకాండ పారాయణాన్నిఅద్భుతంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారంలో కోట్లాది మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించి పాల్గొంటున్నట్లు తెలిపారు. శ్రీవారి అనుగ్రహం వలన త్వరలో కరోనా వైరస్ నశించి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు.
సుందరకాండ పారాయణం కార్యక్రమం నిర్వహిస్తున్న తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ ప్రపంచ ప్రజల యోగ క్షేమం కొరకు టిటిడి 140 రోజులుగా శ్రీవారి అనుగ్రహంతో మంత్ర పారాయణ కార్యక్రమం నిర్వహస్తున్నట్లు తెలిపారు. సుందరకాండ పారాయణంలో అష్టమ సర్గ వలన అష్టసిద్ధులు, నవ సర్గ వలన నవనిధులు సిద్ధిస్తాయని, దశమ సర్గ వలన 5 – కర్మ, 5- జ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచుకోవచ్చని, ఏకాదశః సర్గ పారాయణం వలన మనస్సులోని మాలిన్యాలు తొలగిపోతాయని వివరించారు.
అఖండ పారాయణంలో మొదటి పర్యాయం ప్రథమసర్గలోని 211 శ్లోకాలను, 2వ పర్యాయం ద్వితీయ సర్గ నుంచి సప్తమ సర్గ వరకు ఉన్న మొత్తం 227 శ్లోకాలను, 3వ పర్యాయం అష్టమ సర్గ నుంచి ఏకాదశః సర్గ వరకు ఉన్న మొత్తం 182 శ్లోకాలను పారాయణం చేసినట్లు తెలిపారు. శ్రీవారి అనుగ్రహంతో సుందరకాండలోని 68 సర్గలలోని 2821 శ్లోకాలను మొత్తం 16 పర్యాయలు అఖండ పారాయణం చేయనున్నట్లు తెలిపారు. సుందరకాండ పారాయణం చేయడం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని వివరించారు.
కాగా టిటిడి ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమతి వందన బృందం ” జయ రాఘవోత్తమ ప్రభో జగన్మోహణ …..భయ నివారణ హరే …జయ జనాకి పతే……”,
అనే సంకీర్తనను కార్యక్రమం ప్రారంభంలో, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ బి.రఘునాథ్, శ్రీ భాస్కర్ బృందం ” శ్రీ హనుమ…..జై హనుమ …..అంజలి తనయ జయ హనుమ ....” అనే సంకీర్తనను కార్యక్రమం ముగింపులో సుమధురంగా అలపించారు.
అఖండ పారాయణంలోని అష్టమ సర్గ నుంచి ఏకాదశః సర్గ వరకు ఉన్న మొత్తం 182 శ్లోకాలను శ్రీ పవన్‌కుమార్ శర్మ, శ్రీ శేషాచార్యులు పారాయణం చేశారు. ఈ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి, ఎఫ్ ఎ అండ్ సిఏవో శ్రీ బాలాజి, వైఖానస ఆగమ సలహాదారు శ్రీ మోహన రంగచార్యులు, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్, ఎస్వీ వేద ఉన్నత వేద అధ్యాయన సంస్థ ప్రత్యేకాధికారి శ్రీ విభీషణ శర్మ పాల్గొన్నారు.
ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వహక సభ్యులు విజయవాడకు చెందిన శ్రీ బి.వి.సుబ్బరావు రూ.10 లక్షలు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు విరాళంగా అందించారు.
తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం ఈ విరాళం చెక్కును దాత టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డికి అందచేశారు.