విశాల్ కు హైకోర్టులో చుక్కెదురు…
ప్రముఖ తమిళ హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్టులో వ్యతిరేక ఫలితం ఎదురైంది. విశాల్ నటించిన ‘యాక్షన్’ అనే చిత్రం గతేడాది నవంబరులో రిలీజైంది. ఇందులో విశాల్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించగా, సుందర్.సి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మించాలని చిత్ర నిర్మాణ సంస్థ ట్రైడెంట్ ఆర్ట్స్ భావించింది. అయితే బడ్జెట్ తగ్గితే సినిమా నాణ్యత దెబ్బతింటుందని భావించిన హీరో విశాల్… సినిమా రూ.20 కోట్లు కూడా వసూలు చేయలేకపోతే ఆ నష్టాలను తాను భరిస్తానంటూ నిర్మాతలకు నచ్చచెప్పారు.
విశాల్ మాట ఇవ్వడంతో నిర్మాతలు ‘యాక్షన్’ సినిమా కోసం రూ.44 కోట్లు ఖర్చు చేశారు. కానీ, ‘యాక్షన్’ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన రీతిలో వసూళ్లు రాబట్టుకోలేకపోయింది. తమిళనాడులో రూ.7.7 కోట్లు, ఏపీ-తెలంగాణలో రూ.4 కోట్లు వసూలు చేసి నష్టాలు మిగిల్చింది. ఈ నేపథ్యంలో, ట్రైడెంట్ ఆర్ట్స్ అధినేతలు హీరో విశాల్ తో తమ నష్టాల సంగతి చర్చించారు. తాను నటించే ‘చక్ర’ చిత్రాన్ని ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్లోనే చేస్తానని విశాల్ హామీ ఇచ్చారు.
అయితే, ఇప్పుడా ‘చక్ర’ చిత్రాన్ని హీరో విశాల్ తమ బ్యానర్లో కాకుండా అతని సొంత బ్యానర్లో చేస్తున్నారంటూ ట్రైడెంట్ ఆర్ట్స్ అధినేతలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం… ఇచ్చిన మాట ప్రకారం ‘యాక్షన్’ సినిమాతో నష్టపోయిన నిర్మాతలకు హీరో విశాల్ డబ్బు చెల్లించాల్సిందేనని తీర్పు ఇచ్చింది. విశాల్ రూ.8.29 కోట్లకు గ్యారంటీ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఏదేమైనా ఓ చిత్ర పరాజయం హీరో విశాల్ ను ఆర్థికంగానూ వెంటాడడం దురదృష్టకరం!