టాలీవుడ్ యువ దర్శకుడు మృతి…


ఎన్నో ఏళ్ల శ్రమ.. సహాయ దర్శకుడిగా మొదలైన అతని ప్రయాణం వెండితెర మీద దర్శకుడిగా తన పేరు చూసుకోవాలని తపించాడు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకున్నాడు. నిద్రలేని రాత్రులెన్నో గడిపాడు.. క్రియేటివిటీకి పదును పెట్టే క్రమంలో కథలను వార్చి వండాడు. ట్రెండ్ సెట్ చేయాలనే ఉద్దేశంతో మంచి కథ రాసుకున్నాడు. చక్కగా దర్శకత్వం వహించాడు. కానీ, తాను దర్శకత్వం వహించిన తొలి సినిమాను చూడకుండానే అతను మరణించాడు. యువ దర్శకుడి మరణంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ‘స్వామిరారా’ దర్శకుడు సుధీర్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్, ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గతేడాది శర్వానంద్ హీరోగా వచ్చిన ‘రణరంగం’ సినిమాకు ప్రవీణ్, సుధీర్ వర్మ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు.

ఈ నేపథ్యంలో అతని పనితనం మెచ్చిన అల్లు అరవింద్ ఆహా ఓటీటీలో ఓ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించారు. దీంతో తన సినిమా పనులతోనే బిజీ అయిపోయాడు ప్రవీణ్.

కరోనా రోజులను దాటుకుని వరుస షూటింగులు చేసుకుంటూ చివరి దశకు వచ్చేశారు. ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా అందులో కార్ నడపాల్సిన సన్నివేశం ఒకటి ఉంది. అందులో కారును తాను నడిపి చూపిస్తానని చెప్పాడు. ప్రవీణ్ కారు డ్రైవింగ్ చేస్తుండగా అనుకోకుండా ఆ కార్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వారం రోజుల పాటు చికిత్స పొందుతూ అక్టోబర్ 9న పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. అతని మృతివార్త తెలుసుకున్న సుధీర్ వర్మ, హీరో నిఖిల్ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. దర్శకుడిగా తొలి సినిమా కూడా పూర్తి కాకుండానే యువ దర్శకుడు మరణించడం చిత్ర పరిశ్రమలో విషాదం నింపేసింది. ఈయన మరణానికి పలువురు దర్శకులు సంతాపం వ్యక్తంచేశారు. కాగా, ఈ ఏడాది మే నెలలో తమిళ సినిమా రంగంలో కూడా ఇలాగే యువ దర్శకుడు అరుణ్‌ ప్రశాంత్ అలియాస్ వెంకట్ పక్కర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కోయంబత్తూర్‌లోని మెట్టుపాళ్యం సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రముఖ దర్శకుడు శంకర్‌ వద్ద అరుణ్‌ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అతడు తొలిసారి దర్శకుడిగా పరిచయం కాబోతున్న సినిమా ‘4G’. ఆ సినిమా విడుదల కాకముందే, తన పేరును బిగ్ స్క్రీన్ మీద చూసుకోకుండానే ఆకస్మికంగా చనిపోయాడు.

About The Author