నేడు రెండు అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం…
* ఉదయం 5నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుర్గాదేవి అలంకారం
* మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8గంటల వరకు మహిషాసుర మర్థని అలంకారం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ నెల 25న నిజ ఆశ్వయుజ శుద్ధ నవమి ఆదివారంనాడు విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనంతో దసరా ఉత్పవాలు ముగియనున్నాయి. అదే రోజున సాయంత్రం 5గంటలకు పరమపావనీ అయిన కృష్ణవేణమ్మ ఒడిలో ఇంద్రకీలాద్రి అధిష్టాన దేవత అయిన కనకదుర్గమ్మకు హంస వాహన సేవ జరగనుంది. అమ్మవారు కృష్ణానదిలో జల విహరం చేయనున్నారు. తెప్పోత్సవంగా పిలిచే ఈ హంసవాహన సేవలో త్రిలోక సంచారానికి గుర్తుగా శ్రీ గంగా, పార్వతీ (దుర్గ) సమేత శ్రీ మల్లేశ్వరస్వామి వార్లను మూడుసార్లుగా ప్రదక్షిణులతో కృష్ణానదిలో జలవిహారం చేయిస్తారు. ఈ ఏడాది నవరాత్రులు 9రోజులు పాటు నిర్వహిస్తుండటంతో ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన శనివారం ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ రెండు అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనుంది. అందులో భాగంగా దుర్గాష్టమి సందర్భంగా ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుర్గా దేవి అలంకారంలోనూ, మహార్నవమి సందర్భంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు మహిషాసుర మర్థని దేవి అలంకారంలోనూ కనకదుర్గమ్మ భక్తులను కటాక్షించనుంది.
దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపం దుర్గాదేవి …
శరన్నవరాత్రుల్లో భాగంగా 8వ రోజైన నిజ ఆశ్వయుజ శుద్ధ అష్టమి సందర్భంగా శనివారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీదుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఎనిమిదో రోజు ఉదయం అష్టమి నాడు దుర్గాదేవిగా భక్తులను సాక్షాత్కారిస్తుంది జగదంబ. దుర్గముడనే రాక్షసుడిని సంహరించినందున దుర్గ అని పేరొచ్చింది. దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా భక్తులు దుర్గాదేవిని కొలుస్తారు. ఎరుపు రంగు చీరలో త్రిశూలం చేతపట్టుకుని కోటి సూర్యప్రభలతో వెలుగొందే ఈ అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తే శత్రు బాధలు నశిస్తాయి. ఈ రోజున అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గారెలు, కదంబం (కూరగాయలు, అన్నం కలిపి వండేది) బెల్లం, పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున భక్తులు దుర్గాష్టమిగా కూడా జరుపుకుంటారు.
మహిషాసురమర్థినీ దేవి… నవదుర్గల్లో ఇదే అత్యుగ్రరూపం…
శరన్నవరాత్రుల్లో భాగంగా 8వ రోజైన నిజ ఆశ్వయుజ శుద్ధ నవమి పురస్కరించుకుని శనివారంనాడు మధ్యాహ్నం 2గంటలు నుంచి రాత్రి 8గంటల వరకు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ మహిషాసురమర్థినీ దేవిగా దర్శనమిస్తుంది. అష్ట భుజాలతో దుష్టుడైన మహిషాసురుడిని అమ్మవారు సంహరించింది ఈ రూపంలోనే. అందుకే ఇది నవదుర్గల్లో అత్యుగ్రరూపం. ఈ రోజున జగన్మాత కనకదుర్గమ్మ లేతరంగు దుస్తుల్లో సింహ వాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన మహాశక్తిగా భక్తులను సాక్షాత్కరిస్తుంది. ఈ తల్లికి గారెలు, బెల్లంతో కలిపిన అన్నాన్ని నైవేద్యంగా నివేదిస్తారు.