ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆస్తుల కేసుపై రెండోరోజు సీబీఐ కోర్టులో వాదనలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆస్తుల కేసుపై హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో రెండవ రోజు వాదనలు కొనసాగనున్నాయి. జగన్ తరపున సీనియర్ అడ్వొకేట్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం సీబీఐ కేసులతోపాటు ED కేసులపైన ఒకేసారి విచారణ జరపాలని నిర్ణయించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. CBI కేసుల ఆధారంగానే ED కేసులు పెట్టిందని ఒకవేళ CBI కోర్టు ఆ కేసు కొట్టేస్తే ED కేసుల ప్రస్తావనే ఉండదని వివరించారు. అలాగే జగతిలో పెట్టుబడుల విషయంలోనూ అంతా పారదర్శకంగానే జరిగిందని కోర్టు ముందు వాదనలు వినిపించారు. కంపెనీల చట్టం ఉల్లంఘనపై ఎలాంటి ఆధారాలు CBI చూపించలేదని, అలాగే జగతిలో పెట్టుబడులు పెట్టిన వారు కూడా ఫిర్యాదు చేయలేదని జగన్ తరపు అడ్వొకేట్ అన్నారు. ఇలాంటి వాటిని పరిగణనలోకి తీసుకుని జగన్ కేసులో నుంచి తనను తప్పించాలని కోరుతూ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మిగతా విచారణ బుధవారం జరగనుంది.
హైదరాబాద్ నాంపల్లిలోని గగన్‌విహార్‌లో ఉన్న CBI కోర్టులో విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతోంది. జగన్ ఆస్తుల కేసులో రోజువారీ విచారణ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇదే కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాంకీ ఛైర్మన్ అయోధ్యరామిరెడ్డి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై CBI, ED ప్రతినిధులు బుధవారం వాదనలు వినిపించనున్నారు.