ఏపిలో ఆడపిల్లలపై జరుగుతున్న వరుస అత్యాచారాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర భావోద్వేగం


ఏపిలో ఆడపిల్లలపై జరుగుతున్న వరుస అత్యాచారాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర భావోద్వేగం చెందారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని రాయలపేటలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఈ మేరకు జనసేనాని పవన్ భావోద్వేగంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరగటం అత్యంత హేయమైన చర్యని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ‘‘ఏమిటీ పశువాంఛ. ఎక్కడికి పోతోంది మన సమాజం’’ అంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని రాయలపేటలో నిన్న సాయంత్రం జరిగిన ఈ సంఘటన గురించి వినడానికే జుగుప్స కలుగిస్తోందని మండిపడ్డారు. ఆ పసిదాని పరిస్థితి ఊహించుకుంటే గుండెలు భారంగా మారిపోతున్నాయని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు.
ఆ మృగాడి పైశాచికత్వానికి బలైపోయిన ఆ పసిపిల్ల ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆసుపత్రిలో చేర్చే సమయానికి అధిక రక్తస్రావం వల్ల ఆ పాప పరిస్థితి దయనీయంగా ఉందని పలమనేరు ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు చెబుతున్న వీడియో చూసినప్పుడు కలిగిన ఆవేదన మాటలకు అందనిదని భావోద్వేగం చెందారు. ఆడుకోవడానికి పొరుగింటికి వెళితే 26 ఏళ్ల మానవ మృగం ఆ పసిదానిని కబళించి వేసిందని ధ్వజమెత్తారు.

ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లలపై వరుసగా అకృత్యాలు జరుగుతున్నా యంత్రాంగం ఏమీ చేయని పరిస్థితిలో ఉందని ఘాటుగా విమర్శించారు. మొన్నటికిమొన్న గాజువాకలో 17 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో ఒక రాక్షసుడు గొంతును కోసేసి ప్రాణాలు తీశాడని, విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్థిని తేజస్విని ప్రాణాలను ఆమె ఇంట్లోనే ఒక మృగాడు అత్యంత పాశవికంగా తీసేశాడని పవన్ గుర్తు చేసారు. అలాగే విజయవాడలోనే ప్రేమించడం లేదని ఓ నర్సును మరో దుర్మార్గుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడని మండిపడ్డారు. రాష్ట్రంలో ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలల్లో 584 అత్యాచారం కేసులు నమోదు అయ్యాయని, నిర్భయ, దిశ వంటి చట్టాలు ఉన్నా ఆడపడుచులపై ఎందుకు దాడులు జరుగుతున్నాయని పవన్ సూటిగా ప్రశ్నించారు.

ఎప్పుడో ఖరారయ్యే శిక్షలకు ఎందుకు భయపాడాలనే ఉద్దేశంతో ఉన్మాదులు కిరాతకంగా వ్యవహరిస్తున్నారని, అందువల్లే నేరం చేయాలంటేనే భయపడే శిక్షలు రావాలని పవన్ అభిప్రాయపడ్డారు. అమ్మాయిల పట్ల అత్యాచారం చేసిన కిరాతకులకు శిక్షలు బహిరంగంగా అమలు కావాలని డిమాండ్ చేశారు. దీనిపై మేధావులు, సామాజికవేత్తలు, మహిళా సంఘాలు గళం విప్పాలని పవన్ కోరారు. లేని పక్షంలో అమాయకులైన ఆడపిల్లలు బలైపోతూనే ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలపేట సంఘటనలో దోషిని కఠినంగా శిక్షించాలని, ఆ బాలిక తల్లిదండ్రులకు తగిన పరిహారం అందించాలని, ఆ పసిబిడ్డ కోలుకునే వరకు ప్రభుత్వం అండగా ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ పవన్ చేశారు.

About The Author