తంత్ర-ఒక ఉపోద్ఘాతం…


భావప్రాప్తి కలుగకుండా ఏకబిగిన తొమ్మిది గంటల పాటు మైధునంలో పాల్గొనటం సాధ్యమే అంటుంది తంత్ర. జననేంద్రియాల ద్వారా మాత్రమే కాకుండా ,పంచేంద్రియాల ద్వారా కూడా శృంగార రస సిద్ధి పొందవచ్చని చెప్తోంది తంత్ర. పంచభూతాలకు ప్రతీకలుగా మన దేహంలో ఉన్న పంచధాతువులు ఈ మహత్కార్యంలో ఉద్దీపనలుగా పని చేస్తాయని కూడా తంత్ర చెప్తోంది.లౌకిక బాధలనుంచి అలౌకిక ఆనందాన్ని పొందటానికి శృంగారం,మైధునం తిరుగు లేని మార్గం అంటుంది తంత్ర.మోక్ష సాధనకు సర్వసంగ పరిత్యాగం అవసరం లేదు.వైవాహిక జీవితంలోని సంపూర్ణ ఆనందాన్ని అనుభవించటం ద్వారా కూడా మోక్షానందం సాధ్యమేనని తంత్ర బోధిస్తుంది. రెండేళ్ళ అధ్యయనం తర్వాత దాన్ని గురించి రాసే సాహసం చేస్తున్నాను.

నిజానికి ఈ సబ్జెక్ట్ మీద రెండేళ్ళ క్రితమే రాద్దామనుకున్నాను. కానీ,సున్నితమైన అంశం కావటం,పలు వర్గాల మనోభావాలకు ముడిపడి ఉండటంతో రాయకుండా వదిలేశాను.కానీ,ఇప్పుడు రాయటానికి ప్రేరణ ఇచ్చిన అంశాలేమిటో ముందుగా మీకు వివరిస్తాను.రెండేళ్ళ క్రితం హిమాలయాల్లో నేను నెలరోజులు గడిపిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది.అప్పుడే ఒక విషయం గమనించాను. రిశికేశ్ లోని రాం ఝూలా ,లక్ష్మణ్ ఝూలా ప్రాంతంలో నడుస్తూ ఉంటె వందలాది విదేశీయులు మనకు కన్పిస్తారు.వందకు పైగా యోగా కేంద్రాలు ,తంత్ర సాధనా కేంద్రాలు కన్పిస్తాయి. కేవలం యోగ,ప్రాణాయామ నేర్పించటానికి నెలకు వెయ్యి డాలర్లు,తంత్ర సాధన అయితే రెండు వేల డాలర్లు అక్కడ ఫీజు వసూలు చేస్తారు. ఆ కేంద్రాలు నిరంతరం విదేశీయులతో క్రిక్కిరిసి ఉంటాయి.అలాగే,రిషికేష్ లో పెద్ద సంఖ్యలో పుస్తకాల షాపులు ,వాటిలో తంత్రకు సంబంధించిన వందలాది పుస్తకాలు ఉంటాయి.వాటి అమ్మకాలు కూడా బాగా ఉంటాయి.అలాగే,ఇటీవల యాత్రలో నేపాల్ లోని పోఖరా లోనూ పెద్ద సంఖ్యలో పుస్తకాల షాపులు,అందులోనూ భారీ సంఖ్యలో తంత్ర పుస్తకాలు ఉండటం గమనించాను. ఈ పోఖరా లోనూ పెద్ద ఎత్తున విదేశీ యాత్రికులు కన్పిస్తారు. అలాగే ఖాట్మండు లోని పాటన్ లోని లలిత్ పూర్ లో ఉన్న నేషనల్ మ్యూజియం లోనూ తంత్రకు సంబంధించిన పలు విగ్రహాలు, గ్రంధాలు చూసాను.మన పూర్వీకులు శోధించి,సాధించిన అపురూపమైన జ్ఞాన సంపదను ఇప్పటికే శతాబ్దాలుగా విదేశీయులు కొల్లగోట్టుకుపోయిన బాధ నాలో ఉంది.అలాగే,విలువైన గ్రంధాలు అగ్నికి ఆహుతి చేసిన విషాద సంఘటనలూ నాకు గుర్తున్నాయి.నలంద విశ్వ విద్యాలయంలోని తొమ్మిది అంతస్తుల గ్రంధాలయాన్ని అగ్నికి ఆహుతి చేశారనీ,ఆ మంటలు చల్లారటానికి ఆరు నెలలు పట్టిందీ అని విన్నప్పుడు మనసుకు కలిగిన వేదన అంతాఇంతా కాదు.మళ్ళీ ఇప్పుడు అపురూపమైన తంత్ర పరిజ్ఞానాన్ని ఈ రూపంలో కొల్లగొట్టుకు పోతుంటే ఇంకా నోరు మూసుకొని ,చేతులు కట్టేసుకొని ఉండలేక పోతున్నాను.తంత్ర దైవికమా?క్షుద్రమా ?అనే చర్చలోకి నేను పోదల్చుకోలేదు.

ప్రేరణ కల్గించిన మరో అంశం గురించి కూడా ఇక్కడ ప్రస్తావిస్తాను.నా వృత్తి రీత్యా గత ఇరవై ఏళ్ళలో విడాకులు తీసుకున్న వేలాది జంటలను నేను చూసాను. చాలా కేసుల్లో వాళ్ళు చెప్పిన కారణాలు 1.అతనికి మగతనం లేదు.2. ఆమెకి సెక్స్ మీద ఇంటరెస్ట్ లేదు.3 అతనికి/ఆమెకి అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ నిజాలే. కారణం యాంత్రికత,ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లు ట్ వచ్చిన తర్వాత రేడియేషన్ వల్లనో, పని కారణంగా వచ్చే మానసిక వత్తిడి లేదా తినే ఆహారంలో కల్తీ,పోల్ల్యూషన్ వల్లనో లైంగిక లైంగిక సామర్ధ్యం తగ్గిపోవటం జరుగుతూ వస్తోంది.ఇక శృంగారంలో స్త్రీ దేహం సిద్ధమయ్యే లోగానే పురుషుడు భావ ప్రాప్తికి లోనవ్వటం, తద్వారా కలిగే అసంతృప్తి,ఫ్రస్ట్రేషన్ వల్ల కూడా అనేక సమస్యలు వచ్చి విడాకులకు కారణ మవుతున్నాయి.ఇలాంటి సమస్యలన్నింటికీ సమాధానం యోగ,తంత్ర, వాత్సాయన కామసూత్రాల్లో దొరుకుతుంది. మరీ లోతుగా వెళ్ళకుండా పరిమితులతో తంత్రను ఉపయోగించుకుంటే ఆధునిక సమాజంలో కొత్త తరం లబ్ది పొందుతుంది అనేది నా విశ్వాసం.

ఈ సబ్జెక్ట్ మీద రాస్తున్నానూ అనగానే కొందరు ఆప్తులు ఫోన్ చేసి సున్నితమైన అంశం మొదలెట్టారు జాగ్రత్త అని సుతిమెత్తగా హెచ్చరించారు.ఇప్పుడు దీని మీద మీ అభిప్రాయం కోరుతున్నాను.కేవలం ఉపోద్ఘాతం తోనే ఆపెయ్యనా?లేక దీని మీద విస్తారంగా రాయనా?మీరే చెప్పండి. మీ ఫీడ్ బ్యాక్ తీసుకొని వాత్సాయన కామ సూత్రాలు,ఊర్ధ్వ రేతస్కులు,దేవాలయాల మీద శృంగార భంగిమలు , బౌద్ధ తంత్ర,భైరవ తంత్ర,నాగ తంత్ర మరికొన్ని రకాల తంత్ర ల గురించి రాస్తాను.లేదా ఇక్కడితో ఆపేస్తాను.

About The Author