తిరుమల శ్రీవారి ఆశీస్సులు కోసం శ్రీవారి హుండీలో నిహారిక చైతన్యల వెడ్డింగ్ కార్డు
ప్రముఖ నటుడు నాగబాబు కూతురు నిహారిక వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు తనయుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహ నిశ్చితార్థం ఆగష్టు నెలలో హైదరాబాదులో జరిగిన విషయం విదితమే. ఇప్పుడు వీరి వివాహం డిసెంబర్ 9న జరగనుంది. ఈ విషయాన్ని వరుడి తండ్రి ప్రభాకరరావు మీడియాకు తెలిపారు. ఈ రోజు ప్రభాకరరావు దంపతులు తిరుమలకు విచ్చేసి, పెళ్లిశుభలేఖను స్వామి వారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ప్రభాకరరావు వివాహానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. డిసెంబర్ 9న రాత్రి 7.15 నిమిషాలకు వివాహ ముహూర్తాన్ని నిశ్చయించారని తెలిపారు. అలాగే వివాహాన్ని రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ నగరంలోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్ హోటల్ లో నిర్వహించనున్నామని పేర్కొన్నారు.