స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం: ఏపీ ఎస్‌ఈసీ…


*గతంలో హింసాత్మక ఘటనలు జరిగినచోట ఎన్నికల రద్దుకు అఖిలపక్షంలో ఏకాభిప్రాయం*

*ఏపీ హైకోర్టుకు నివేదించిన ఎస్‌ఈసీ*

ఈనాడు, అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ హైకోర్టులో మంగళవారం అదనపు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. రాష్ట్రంలో బ్యాలెట్‌ బాక్సుల కొరత ఉందని.. దక్షిణాది రాష్ట్రాల నుంచి బ్యాలెట్‌ బాక్సులు తెచ్చుకునే అవకాశాన్ని పరిశీలించినా, ఆ ప్రయత్నాలు ఫలప్రదం కాలేదని తెలిపారు. బ్యాలెట్‌ బాక్సుల లభ్యత ఆధారంగా వివిధ దశల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు విడుదల చేస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలపై అభిప్రాయ సేకరణకు రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశానికి 19 పార్టీలను ఆహ్వానించగా 11 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారని, రెండు పార్టీలు రాతపూర్వకంగా అభిప్రాయం తెలియజేస్తామని చెప్పాయన్నారు. ఆరు పార్టీలు హాజరు కాలేదని, ఈ సమావేశాన్ని బహిష్కరించాలని వైకాపా నిర్ణయించుకుందని వివరించారు. అఖిలపక్ష సమావేశంలో మార్చిలో ఇచ్చిన ఎన్నికల ప్రకటన ఆధారంగా నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో ఎన్నికల రద్దుకు ఏకాభిప్రాయం వ్యక్తమైందని ఎస్‌ఈసీ తన కౌంటర్‌ అఫిడవిట్‌లో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్‌, మరొకరు గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఇటీవల హైకోర్టు విచారణ జరిపి ఎస్‌ఈసీకి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ హైకోర్టులో అదనపు అఫిడవిట్‌ వేశారు.

About The Author