కొత్త సంవత్సరం తొలిరోజున ప్రధాని మోడీ మనసు విప్పారు…
నిర్ణయాలే కఠినం, ఎక్కడా లేదు కాఠిన్యం.. ప్రజలకు భారం కాదు, వారికి దూరం కాలేదు.. యువతకు తోడు, మధ్యతరగతికి చేదోడు…పాలనపై, పార్టీపై, సాధించిన ప్రగతిపై.. ప్రధాని అంతరంగం.. ‘మోడీ మన్ కీ బాత్ – 2019’ భారత్ టుడే ప్రత్యేక కథనం.
కొత్త సంవత్సరం తొలిరోజున ప్రధాని మోడీ మనసు విప్పారు. ప్రభుత్వ తీరుతెన్నుల నుంచి ప్రతిపక్షాల విమర్శల వరకు. రాజకీయ కూటముల నుంచి సంక్షేమ పథకాల వరకు…అన్నీ పంచుకున్నారు. జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను విడమరిచి చెప్పారు. ఎన్డీఏ సర్కార్ తీసుకున్న నిర్ణయాలన్నీ దిగువ, మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేవేనని అన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ప్రతిష్టాత్మక నిర్ణయాలతో భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందన్నారు ప్రధాని మోడీ. గత ప్రభుత్వాల నిర్వాకం వల్లనే ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోయారన్న ఆయన.. వారిని వెనక్కి రప్పించే బాధ్యత తమపై వుందన్నారు.
అయోధ్య అంశంపై తనదైన శైలిలో స్పందించిన మోడీ :
అయోధ్య అంశంపై తనదైన శైలిలో స్పందించారు ప్రధాని మోడీ. సుప్రీం కోర్టులో ఈ అంశం చివరిదశలో వుందన్నారు. రామమందిర నిర్మాణం విషయంలో విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ ద్వారా ముస్లిం మహిళలకు విముక్తి లభించిందన్న మోడీ.. శబరిమల అంశంతో ట్రిపుల్ తలాక్ ను పోల్చలేమన్నారు. ఇక విపక్షాల కూటములపైన తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించిన ప్రధాని.. రాబోయే ఎన్నికలు దేశ ప్రజలకు.. మహాకూటమికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు.
ప్రశ్న: 2018 లో ఎదురైన పరాజయాల నేపథ్యంలో.. 2019 ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా మీ పార్టీలో వుందా..?
జవాబు : ఈ ఏడాది ప్రజలకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా…నా ఉద్దేశం ప్రకారం 2018లో మేం సఫలీకృతమయ్యాం…దేశంలో ఎన్నికల ప్రక్రియ చాలా చిన్న అంశం…దానికంటే ముఖ్యమైనవి ఎన్నో అంశాలుంటాయి..2018 లో పేదల కోసం మా ప్రభుత్వం ఎన్నో చేసింది.. ఆయుష్మాన్ భారత్ వంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చాం…ప్రపంచం మొత్తం ఈరోజు పర్యావరణ మార్పు గురించి మాట్లాడుకుంటోంది..భారత్ ఆ దిశగా ముందడుగు వేశాం.. ఐక్యరాజ్య సమితి నుంచి భారత్ కు చాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డు రావడమే ఇందుకు ఉదాహరణ…అన్ని గ్రామాలకు విద్యుత్ అందించాం….క్రీడల్లోనూ భారత్ సత్తాచాటింది…గ్రామీణ క్రీడాకారులు కూడా సత్తా చాటారు…మెడల్స్ కూడా పెరిగాయి…
ప్రశ్న : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇది మీ వైఫల్యం కాదా..?
జవాబు: తెలంగాణ, మిజోరంలలో బీజేపీ అధికారంలోకి వస్తుందని..మాతో సహా ఎవరూ చెప్పలేదు…మిగతా మూడు రాష్ట్రాల విషయానికొస్తే… ఛత్తీస్‌గడ్‌లో బీజేపీ ఓటమిపాలైంది….మిగిలిన రెండు రాష్ట్రాల్లో హంగ్ ఏర్పడింది. మాలో ఉన్న లోపాల గురించి చర్చించుకుంటున్నాం. వాటిని అధిగమించడానికి ప్రణాళికలు కూడా రూపొందించుకుంటున్నాం.
ప్రశ్న: మోడీ ప్రచారం చేసిన ప్రతీచోటా ఓట్ల బదిలీ జరగలేదని… మోడీ మ్యాజిక్ తగ్గిపోయిందనే విమర్శలున్నాయి.. మీ సమాధానం..?
జవాబు: ఇప్పుడిలా మాట్లాడుతున్నారంటే మోడీ మ్యాజిక్ అనేది ఒకటున్నట్టే కదా… 2013-14 లోనూ ఒక వర్గం మోడీ గాలి లేదని ప్రచారం చేసింది. ఇప్పుడు అలాంటి వారే తాము పనిచేస్తున్న వ్యక్తులకోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి, ఇలాంటి ప్రచారం మొదలుపెట్టారు. కానీ, ప్రజల ఆశలు, ఆకాంక్షలు మామీదే ఉన్నాయి. అవే సరికొత్త వాతావరణం, ఉత్సాహాన్ని నెలకొల్పుతున్నాయి.
ప్రశ్న: మోడీ గాలి లేకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 180 సీట్లకు మించి రావంటున్నారు.. దీనిపై మీ అభిప్రాయం..?
జవాబు: ఇలా లెక్కలేసుకుంటేనే కదా, వారి కూటముల్లో పార్టీలు చేరేది…తమను తాము రక్షించుకోవడానికి ఇలాంటి మాటలు చెబుతున్నారు. 2019లో సామాన్యుడు ఈ ప్రభుత్వం నుంచి దూరం జరుగుతారని ఎలా అంచనా వేస్తారు..? సామాన్యుడికి ఈ విషయాలన్నీ తెలుసు. నాకు ఈ దేశ ప్రజల మీద, యువత మీద భరోసా ఉంది.
ప్రశ్న: 2016 నుంచి మీరు కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటున్నారు. కానీ, ఆ దిశగా ఫలితాలు కనిపించడం లేదు కదా..?
జవాబు : వారసత్వం, అవినీతి కాంగ్రెస్ సంస్కృతి… నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ ముక్త్ భారత్ అని చెప్పలేదు. కాంగ్రెస్ సంస్కృతి ముక్త్ భారత్ అని చెప్పాను. కాంగ్రెస్ లో అదే పరిస్థితి ఉంటే ఆ పార్టీ అవసరం లేదని నా అభిప్రాయం.
ప్రశ్న: మోడీ, అమిత్ షా ద్వయానికి వరుస ఓటములు తప్పడం లేదు. ఓటమికి పార్టీ నాయకత్వ బాధ్యత ఉందా లేదా..?
జవాబు: మోడీ, అమిత్ షాల కనుసన్నల్లో బీజేపీ నడుస్తోందని చెప్పే వారికి మా పార్టీ గురించి తెలియదు. ఇది ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ..పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలపై ఆధారపడి నడుస్తుంది…ఒకరో, ఇద్దరో పార్టీని నడిపిస్తున్నారన్నది మా పార్టీ గురించి తెలియనివారు చెప్పే మాట.
ప్రశ్న: పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వల్లే 2018 ఎన్నికల్లో మీకు నష్టం జరిగిందని చెబుతున్నారు. అసలు పెద్ద నోట్ల రద్దు ప్రయోజనాలు నెరవేరాయా..?
జవాబు: మన దేశంలో నల్లధనం గురించి ఎన్నో ఏళ్ల నుంచి చర్చలు నడుస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, పెద్దపెద్ద అధికారుల ఇళ్లలో పరుపుల కింద నోట్లు దొరుకుతూ ఉండేవి. సమాంతర ఆర్థిక వ్యవస్థ మన దేశాన్ని నాశనం చేసింది. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశం భవిష్యత్తులో బలమైన ఆర్థిక వ్యవస్థగా మారనుంది. సంచుల్లో నిండిన నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయి. దీనివల్ల ఇప్పుడు జవాబుదారీతనం వచ్చింది. పన్ను పరిధిలోకి వచ్చిన వారి సంఖ్య పెరిగింది. ఇది మా విజయమంటారా..? కాదా..? ఇది మంచి పరిణామమా..? కాదా..?
ప్రశ్న: ఆర్థిక నేరగాళ్లు నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, మెహుల్ ఛోక్సీలు దేశం విడిచి పారిపోయారు. నల్లధనం కట్టడిపై లక్ష్యాలేమీ నెరవేరలేదు కదా..?
జవాబు : మునుపటి ప్రభుత్వమే ఉంటే..వారు దేశం విడిచి పారిపోవాల్సిన అవసరం ఉండేది కాదు. మా ప్రభుత్వం చట్టాన్ని కఠినతరం చేసింది కాబట్టే వాళ్లు పారిపోయారు. వారిని రప్పించడానికి కొన్ని అంతర్జాతీయ చట్టాలను అనుసరించాల్సి ఉంటుంది. వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి చట్టం తీసుకొచ్చాం. ఇదివరకు పారిపోయిన వారు ఎప్పుడూ తిరిగి రాలేదు. ఈ ప్రభుత్వ హయాంలో అలాంటివారు ఎప్పుడోసారి వెనక్కు రావాల్సిందే. దానికోసం మేం దౌత్యపరంగా, చట్టపరంగా, ఆస్తులను స్వాధీనం చేసుకొనేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నాం.
ప్రశ్న: జీఎస్టీని రాహుల్ గాంధీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నారు. మరి, జీఎస్టీని మీరు ఎలా సమర్థించుకుంటారు..?
జవాబు: మాకు ఎవరి పైనా వ్యక్తిగత కక్ష లేదు. అవినీతిపరుల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రాహుల్ గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనడం ఆయన ఆలోచన విధానానికి నిదర్శనం. అన్ని పార్టీల అంగీకారంతోనే దేశంలో జీఎస్టీ ట్యాక్స్ అమలులోకి వచ్చింది. జీఎస్టీ కౌన్సెల్ లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ.. వారి సీఎంలను తప్పు పడుతోందా..? జీఎస్టీకి ముందు 30 శాతం, 40 శాతం పన్నులు ఉండేవి. జీఎస్టీ వల్ల చిరు వ్యాపారులకు ఇబ్బందులు కలిగిన మాట వాస్తవం. ఇంత పెద్ద ట్యాక్స్ అమల్లోకి తెచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు. వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాం. జీఎస్టీని మరింత సరళీకరిస్తున్నాం.
ప్రశ్న: రైతుల కోసం మీ ప్రభుత్వం ఏం చేస్తోంది..?
జవాబు: అన్నింటికంటే ముఖ్యంగా రైతును బలోపేతం చేయాలి. రైతులకు అప్పులు చేయని పరిస్థితి కల్పించాలి. అందుకు భూసారపరీక్ష కార్డులు, దిగుబడులకు మంచి ధరలు, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు 22 పంటలకు 50% లాభం కల్పించడం వంటి చర్యలు తీసుకుంటున్నాం.
ప్రశ్న: రామ మందిరం నిర్మాణం విషయంలో ఎందుకు ముందడుగు పడటం లేదు..? ట్రిపుల్ తలాక్ తరహాలోనే ఆర్డినెన్స్ తేవచ్చు కదా..?
జవాబు: ట్రిపుల్ తలాక్ పై సుప్రీం తీర్పు తర్వాతే ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. ఇప్పుడు మందిర అంశం సుప్రీంకోర్టులో చివరిదశకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. కోర్టులో దీనికి వ్యతిరేకంగా కేసులు వేసేవారిని బయటకు రప్పించండి. అడ్డుకోకండి. న్యాయవాదులంతా కోర్టు ముందుకెళ్లి, ఈ సమస్యను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరుతున్నా.
ప్రశ్న: ట్రిపుల్ తలాక్ నుంచి ముస్లిం మహిళలకు విముక్తి కల్పించాలంటున్నారు. మరోవైపు శబరిమల విషయంలో సంప్రదాయాలను గౌరవించాలని మీ పార్టీ చెబుతోంది..?
జవాబు: పాకిస్థాన్ సహా చాలా ఇస్లామిక్ దేశాలు ట్రిపుల్ తలాక్ ను నిషేధించాయి. అందువల్ల అది విశ్వాసాలకు సంబంధించిన అంశం కాదు. మన దగ్గర కొన్ని ఆలయాల్లోకి పురుషులకు ప్రవేశం ఉండదు. కొన్నిచోట్ల మహిళలకు ప్రవేశం ఉండదు. దీనిపై సుప్రీంకోర్టు మహిళా జడ్జి ఇచ్చిన తీర్పును అందరూ చదవాలి.
ప్రశ్న: కేరళ, కర్ణాటక, పశ్చిమబెంగాల్ లో రాజకీయ హింస పై మీ అభిప్రాయం ఏంటి..?
జవాబు : ప్రత్యర్థుల గొంతు నులిమేసేందుకని హత్యాకాండకు పాల్పడటం దౌర్భాగ్యం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా. పశ్చిమబెంగాల్ లో బీజేపీ ప్రజాస్వామ్యబద్ధంగా పనులు చేసుకోవడానికి వీల్లేకుండా అడ్డుకుంటున్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, అసోం, జమ్మూకశ్మీర్ లోనూ మా శ్రేణులను చంపేస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు భవిష్యత్తుకు మంచిది కాదు.
ప్రశ్న: విపక్షాలన్నీ..‘ఎనీబడీ బట్ మోడీ’ అంటున్నాయి. పార్టీలన్నీ కూటములు కడుతున్నాయి. 2019 ఎన్నికలు నిజంగానే.. మోడీ వర్సెస్ ఎనీబడీ బట్ మోడీ.. లా జరగనున్నాయా..?
జవాబు: ప్రజల ఆకాంక్షలకు ఎవరు దగ్గరగా వున్నారనేదే ముఖ్యం. ఇంతకుముందు ప్రభుత్వాల్లో అవినీతి ఎలా ఉండేదో ప్రజలకు తెలుసు. రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే అక్కడ దోచుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉంటే అక్కడా దోచుకున్నారు. జాతీయ, రాష్ట్రస్థాయి పిడీదారులంతా ఇప్పుడు ఒక్కటవుతున్నారు. ఈ ఎన్నికలు ప్రజలకూ..మహాకూటమికీ మధ్య పోటీగా మారబోతున్నాయి.
ప్రశ్న: 2019 ఎన్నికల్లో మాయావతి మీతో కలిసే అవకాశముందా..?
జవాబు: ఎవరు కలుస్తారు..? ఎవరు కలవరు అన్నదాని గురించి తెలివైనవారు ఇలా టీవీల ముందు చెబుతారని నేననుకోను. తెలంగాణలో కూటమి పరిస్థితి ఏమైంది..? దారుణంగా మారింది కదా..? కానీ దాని గురించి ఎవ్వరూ మాట్లాడుకోరు. కూటమి తొలి ప్రయోగం అక్కడ పూర్తిగా విఫలమైంది. జమ్మూ-కశ్మీర్‌లో కూటమి పార్టీలన్నీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించాయి. కానీ ప్రజలు వారిని తిరస్కరించి 74% మంది ఓట్లు వేశారు. అసోం పంచాయతీ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒకవైపు, బీజేపీ ఒకవైపు ఉంటే.. అక్కడా కూటమి విఫలమైంది. త్రిపురలోనూ కూటమిని ఓడించి మేం 80-90% సీట్లు దక్కించుకున్నాం. నేతలు తమ రక్షణ కోసం చేతులు కలిపినంత మాత్రాన…ప్రజలు కలుస్తారనుకోవడానికి వీల్లేదు.
ప్రశ్న: మీ మిత్రపక్షాలతో మీరు సఖ్యంగా లేరు కదా..? చౌకీదార్ చోర్ హై అని రాహుల్ వినిపించిన నినాదాన్ని.. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వినిపిస్తున్నారు కదా..?
జవాబు: మాకు సంపూర్ణ మెజార్టీ లభించినా కూటమి ధర్మాన్ని పాటిస్తున్నాం. కొన్నిసార్లు ఒత్తిడి తెస్తే ఏదైనా ప్రయోజనం కలుగుతుందనుకుంటే కొన్ని పార్టీలు ఆ దారిని ఎంచుకుంటుంటాయి. అందర్నీ వెంట తీసుకెళ్లడం, అందరి మాటా వినడం, సమస్యలను పరిష్కరించడంతోపాటు.. ప్రాంతీయ ఆకాంక్షలకు బలం కల్పించాలన్నదే మా లక్ష్యం. అందుకు నేను కట్టుబడి ఉన్నాను.