నేటితో నాగార్జున సాగర్‌కు 65 ఏళ్లు…
*లక్షలాది ఎకరాలకు సాగునీరందిస్తూ అన్నదాతల పాలిట జీవనధారగా విరాజిల్లుతున్న నాగార్జున సాగర్ జలాశయం మన తెలుగు రాష్ట్రాలకు మకుటాయమానం.*
*వరల్డ్ ఫేమస్ నాగార్జునసాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగి నేటి (డిసెంబర్ 10)తో 65 ఏళ్లు పూర్తయ్యాయి.
ఆంధ్ర రాష్ట్ర అన్నపూర్ణగా, రైతుల కల్పతరువుగా మారిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు.
ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు, ముత్యాల జమీందార్ మహేశ్వరప్రసాద్ ఆలోచనలు దీనికి అంకురార్పణ చేశాయి.
ప్రాజెక్టు నిర్మాణానికి వేల మంది శ్రమజీవులు చెమట చిందించగా… వందల మంది ప్రాణాలు కోల్పోవడం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు.
1970లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తైంది. డ్యాం నిర్మాణ దశలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొట్టమొదటి చీఫ్ ఇంజనీరుగా పనిచేసిన మీర్‌జాఫర్ అలీ నిబద్ధతను మెచ్చుకోవాల్సిందే.
ప్రపంచ రాతి నిర్మాణాల ప్రాజెక్టుల్లో నాగార్జునసాగర్ డ్యాం పొడవు, ఎత్తుల్లో ప్రథమస్థానంలో ఉండడం విశేషం.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ఇది 285 చ.కి.మీ. విస్తీర్ణంతో 408 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని కలిగివుంది.*
*జలవిద్యుత్ కేంద్రాలు : నాగార్జునసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుగా సేద్యపు నీటినే కాకుండా జలవిద్యుద్ ఉత్పత్తి చేసే కేంద్రంగా కూడా ప్రాధాన్యం పొందింది.*
*నాగార్జునసాగర్ ప్రపంచ పర్యాటక కేంద్రంగా కూడా నిలిచింది. కృష్ణానది లోయలో మహాయాన బౌద్ధమత విస్తరణకు ఆచార్య నాగార్జునుడు నెలకొల్పిన యూనివర్సిటీ ప్రపంచంలో బౌద్ధ మత వ్యాప్తికి ఎంతో దోహదం చేసింది.
క్రీస్తు శకం రెండో శతాబ్దంలోని శాతవాహన కాలంనాటి జీవనశైలి, మూడో శతాబ్దం నాటి ఇక్ష్వాకుల రాజధానిగా విజయపురి ప్రసిద్ధి చెందింది.
ప్రపంచంలోని ఏకైక ఐలాండ్ మ్యూజియంగా ఉన్న నాగార్జునకొండ, అనుపు, ఎత్తిపోతల, ప్రధాన జలవిద్యుత్ కేంద్రాల్ని,… కుడి, ఎడమ కాలువలను,
మోడల్ డ్యాంను చూసేందుకు రోజూ వందల మంది దేశ-విదేశీ పర్యాటకులు నాగార్జునసాగర్‌కు రావడంతో ఇది ప్రపంచ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది.