మూడు రోజుల్లో నాలుగు టన్నుల ఎర్రచందనం పట్టివేత..


తిరుపతి జూ పార్క్ ప్రాంతంలో స్మగ్లర్లు ను అడ్డుకున్న టాస్క్ ఫోర్స్
30ఎర్రచందనం దుంగలు స్వాధీనం
పరారీలో స్మగ్లర్లు
మూడు రోజుల్లో నాలుగు టన్నుల ఎర్రచందనం పట్టివేత

తిరుపతి సమీపంలోని ఎస్వీ జూ పార్క్ వద్ద కాపు కాచిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది తమిళ స్మగ్లర్లు నుంచి 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు ఆదేశాల మేరకు ఆర్ ఎస్ ఐ ఎం.వాసు టీమ్ ఆదివారం శ్రీవారి మెట్టు, భాకరాపేట మార్గం లోని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద తనిఖీ చేస్తూ ఎస్వీ జూ పార్క్ వద్ద మాటు వేశారు. తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో కొంతమంది తమిళ స్మగ్లర్లు దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. దీంతో వారికి హెచ్చరికలు జారీ చేస్తూ చుట్టు ముట్టే ప్రయత్నం చేశారు. స్మగ్లర్లు దుంగలు పడవేసి చీకట్లో పారిపోయారు. చుట్టు పక్కల గాలించగా 30 ఎర్ర చందనం దుంగలు లభించాయి. హై సెక్యూరిటీ ఉన్న ఎస్వీ జూ పార్క్ పాయింట్ లో ఇప్పటి వరకు అనేక సార్లు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆంజనేయులు మాట్లాడుతూ గత వారం రోజులుగా తమిళ స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో సంచరిస్తున్నట్లు సమాచారం అందిందని, ఈ కారణంగా కూంబింగ్ చేశామని తెలిపారు. గత మూడు రోజుల్లో నాలుగు టన్నుల ఎర్రచందనం దుంగలను పట్టుకో గలిగామని చెప్పారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బంది ని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు కేసి.వెంకటయ్య, వివి. గిరిధర్ ఆర్ ఐ భాస్కర్, సిఐలు సుబ్రహ్మణ్యం, వెంకట రవి, చంద్రశేఖర్, ఎఫ్ ఎస్ ఓ నటరాజ పాల్గొన్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కడపజిల్లా లో మరో 32 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
కడప జిల్లా రామాపురం వద్ద మరో 32 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఆంజనేయులు తెలిపారు. ఆర్ ఐ ఆలీభాషా, రామాపురం పోలీసు స్టేషన్ సిబ్బంది తో చేసిన జాయింట్ ఆపరేషన్ లో 32 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రామాపురం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

About The Author