తిరుమలలో ప్రముఖులు పాల్గొన్నారు…
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఉదయం అభిషేకం అనంతరం ఆలయ ఆర్చకులు వైకుంఠ ద్వారాలు తెరిచారు. ఉదయం నాలుగు గంటలకు దర్శనం ప్రారంభం అవ్వగా.. సామాన్య భక్తులు, వీఐపీలు దర్శనాల కోసం క్యూకట్టారు. శుక్రవారం కావడంతో అభిషేకం అనంతరం దర్శనాలు మొదలయ్యాయి. దీంతో తిరుమల క్షేత్రం వైకుంఠాన్ని తలపిస్తోంది. కాగా వైకుంఠ ఏకాదశి పర్వ దినాన పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. తెంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, హైకోర్టు న్యాయమూర్తి వెంకటరమణ, జస్టిస్ ఈశ్వరయ్య, తెలంగాణ హైకోర్టు జస్టిస్ అమర్ నాథ్ గౌడ్, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, తెలంగాణ కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్, సర్కార్ వారి పాట చిత్రం డైరెక్టర్ పరుశురామ్, తదితరులు శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.
సునీల్ దియోధర్ మాట్లాడుతూ… వైకుంఠ ఏకాదశికి టీటీడీ అద్భుతమైన దర్శన ఏర్పాట్లు చేసిందన్నారు. దేవాలయాల నిర్వహణలో టీటీడీ దేశంలోని అన్నీ ఆలయాలకు ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ అద్భుతమైన దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు.
తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వీఐపీలు క్రమ శిక్షణతో శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. అనుకున్న సమయం కంటే ముందుగానే సర్వ దర్శనం ప్రారంభిస్తున్నామన్నారు. భక్తులందరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు ఈ సందర్భంగా ఆలయ అదనపు ఈవో మాట్లాడుతూ.. సాధారణ భక్తులకు గంటన్నర ముందే వైకుంఠద్వార దర్శనం కల్పించినట్లు తెలిపారు. ఉ. 9 గంటలకు అనుకున్నామని కానీ 7.30 గంటలకే ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.
పరిస్థితిని అంచనా వేసి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏర్పట్లు చేసినట్లు, సర్వదర్శనం టిక్కెట్ల పెంచినట్లు పేర్కొన్నారు. సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించగలుగుతున్నామన్నారు. ప్రముఖులు సహకరించడంతో సాధారణ భక్తులకు ఎక్కువ సమయం లభించిందన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రెండు వేలు, దాతలకు రెండు వేలు, వీఐపీలకు మూడు వేల మందికి టికెట్లు కేటాయించామన్నారు.