భక్తుల మనోభావాలను పరిరక్షించడమే ప్రభుత్వ ధ్యేయం…
భక్తుల మనోభావాలను పరిరక్షించడమే ప్రభుత్వ ధ్యేయం
చెప్పిన సమయానికి ముందే నూతన రథం సిద్ధం
__ మంత్రి వేణుగోపాల కృష్ణ
భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు అగ్నికి ఆహుతి అయిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి రథం స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన రథాన్ని తయారు చేయించి స్వామి వారి కళ్యాణానికి సిద్ధం చేయడం జరిగిందని రాష్ట్ర బి.సి వెల్ఫేర్ మంత్రి చెల్లు బోయిన వేణు గోపాలకృష్ణ తెలియ చేసారు. ఆదివారం మంత్రి రాజోలు శాసన సభ్యులు రాపాక వరప్రసాదరావు, జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి,అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ తో కలిసి అంతర్వేదిలో నిర్మాణం పూర్తి అయిన స్వామి వారి నూతన రథాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ సెప్టెంబర్ 5వ తేదీన జరిగిన దురదృష్టకర సంఘటనలో స్వామివారి రథం దగ్దం కావడం తో ముఖ్యమంత్రి తక్షణమే సి.బి.ఐ ఎంక్వైరీ వేసి నూతన రథ నిర్మాణానికి 90 లక్షలు మంజూరు చేశారని మంత్రి తెలిపారు. నూతన రథ నిర్మాణానికి అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ చైర్మన్ గా దేవాదాయ శాఖ ఏ.డి.సి. తదితరులతో కమిటీ ఏర్పాటు చేసి శరవేగంగా నూతన రథాన్ని నిర్మాణం చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. డిసెంబర్ 30 వ తేదీకి నూతన రథాన్ని సిద్ధం చేస్తామని దేవాదాయ శాఖ అధికారులు,ఆశాఖ ఇంజినీరింగ్ అధికారులు, శిల్పి గణపతి స్థపతి మాట ఇచ్చి శర వేగంగా సెప్టెంబర్ 27 వ తేదీన పనులు ప్రారంభించి చెప్పిన సమయానికి ముందే ఏడు అంతస్తులు తో నూతన రథాన్ని సిద్ధం చేశారని మంత్రి చెబుతూ సబ్ కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారులను, శిల్పిని అభినందించారు. రధారూడుడు అయిన శ్రీ మహా విష్ణువు ను దర్శించుకుంటే పుణ్యం వస్తుందని,పునర్జన్మ ఉండదనే భక్తుల మనోభావాలను కాపాడేందుకు ముఖ్యమంత్రి నూతన రథ నిర్మాణానికి తనకు ఆదేశాలు ఇవ్వడం తో బాటు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేశారని మంత్రి తెలిపారు. నూతన రథ నిర్మాణ పనులను మధ్యలో తాను పరిశీలించడం జరిగిందని మంత్రి తెలిపారు.రేపు భీష్మ ఏకాదశి పర్వదినానికి అన్ని హంగులతో నూతన రథాన్ని సిద్ధం చేసి రథ సప్తమి నాడు ప్రారంభించడం జరుగుతుందని మంత్రి తెలియచేశారు. రాజోలు శాసన సభ్యులు రాపాక వరప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్ర బి.సి. వెల్ ఫేర్ మంత్రి పర్యవేక్షణలో నూతన రథాన్ని త్వరితగతిన పూర్తి చేశారని మంత్రి స్వీయ పర్యవేక్షణలో రావులపాలెం లో రథానికి కావలసిన వుడ్ ను కొనుగోలు చేసి కోటి 10 లక్షలతో అనుకున్న సమయం కంటే పది రోజులు ముందే రథాన్ని సిద్ధం చేయడం జరిగిందని శాసన సభ్యులు అన్నారు. జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ నూతన రథ నిర్మాణాన్ని దేవాదాయ శాఖ అధికారులు,ఇంజినీరింగ్ అధికారులు శిల్పి ఒక ఛాలెంజ్ గా తీసుకుని సకాలంలో నూతన రథాన్ని సిద్ధం చేశారని కలెక్టర్ అన్నారు. స్వామి వారి ఆశీస్సులు తో ఏ విఘ్నాలు లేకుండా అన్ని పనులు విజయవంతంగా జరగాలని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ ఎస్.సి.మాల కార్పోరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి పెదపాటి అమ్మాజి, దేవాదాయ శాఖ ఏ.డి.సి.రామ చంద్రమోహన్, ఆలయ ఏసీ యర్రంశెట్టి భద్రాజీ, తదితరులు పాల్గొన్నారు.