రెండో రకం కరోనా ముంచుకొస్తోందా..? అసలు బ్రిటన్ లో ఏం జరిగింది..?
భారత్ లో హై అలెర్ట్ ఎందుకు ప్రకటించారు..?
కరోనా వైరస్.. ప్రపంచాన్ని గడగడలాడించిన పేరు.. ఇప్పుడు కొత్త కరోనా వైరస్ మళ్లీ నిద్రలేకుండా చేస్తోంది. బ్రిటన్ లో బైటపడ్డ రెండో రకం కరోనా వైరస్, మొదటి కరోనా వైరస్ కంటే అత్యంత ప్రమాదకరమైనదని తేల్చారు. ఈ వైరస్ కొవిడ్ -19 కంటే 70శాతం ఎక్కువగా ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉంది. ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. బ్రిటన్ లో ఇంత ప్రమాదకరమైన కరోనా వైరస్ బైటపడటంతో దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ బ్రిటన్ తో రాకపోకలను స్తంభింపజేశాయి. మరో వైపు భారత్ లో లండన్ నుంచి వచ్చిన ఐదుగురికి ఈ కరోనా వైరస్ ఉందని తేలడంతో మన దేశంలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. ఓవైపు కొవిడ్ -19 వ్యాక్సిన్ వస్తుందన్న ప్రచారం సాగుతుండగా, మరోవైపు అంతకంటే బలమైన కరోనా వైరస్ ముంచుకొస్తుందన్న భయం జనానికి నిద్ర లేకుండా చేస్తోంది.
ఈ వైరస్ కు బ్రిటన్ శాస్త్రవేత్తలు VUI -2020 12/01 అనే పేరు పెట్టారు. కొవిడ్ -19 వైరస్ కంటే ఇది ఎందుకు బలమైనదో కూడా ప్రాథమికంగా ఒక నివేదికలో పేర్కొన్నారు. గతంలో కరోనా వైరస్ ప్రొటీన్ పైన ఉండే కిరీటాల్లాంటి నిర్మాణంలో మార్పులొచ్చాయని, ఈ కొత్తరకం వైరస్ లో ఆ ప్రొటీన్ కిరీటాలు మరింత బలంగా ఉన్నాయని చెబుతున్నారు. అందుకే ఈ వైరస్.. చాలా తొందరగా ఒకరినుంచిమరోకరికి వ్యాపిస్తుందని తేల్చారు. ఇప్పటి వరకు బ్రిటన్ లో 1100 మందికి ఈ కొత్తరకం కరోనా వైరస్ సోకింది. ఇటలీలో కూడా ఈ కొత్తరకం కరోనా వైరస్ ని కనుగొన్నారు. ఫ్రాన్స్ లో కూడా ఇది వ్యాపిస్తుందన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఆస్ట్రేలియాలో కూడా లండన్ నుంచి వచ్చిన ఇద్దరికి ఈ తరహా కరోనా వైరస్ సోకింది. అయితే ఈ కరోనా వైరస్ సోకిన తర్వాత ఆ వ్యక్తులలో ఎటువంటి అనారోగ్యం తలెత్తుతుందనే విషయం ఇప్పుడు పరిశోధిస్తున్నారు. కొవిడ్ -19 కు సరైన మందులు కనుగొనలేక, తంటాలు పడుతున్న శాస్త్రవేత్తలకు, ఇప్పుడు ఈ రెండోరకం కరోనా వైరస్ మరో సవాల్ విసిరింది. ఈ కొత్త వైరస్ భయంతో యూరప్ దేశాలన్నీ బ్రిటన్ కు రాకపోకల్ని స్తంభింపజేశాయి. బ్రిటన్ తో సరిహద్దులు ఉన్న దేశాలన్నీ, పూర్తిగా ఆ దేశ సరిహద్దుల్ని మూసివేశాయి.
మనదేశంలో కూడా మహారాష్ట్రలో మరో 15 రోజులపాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. విదేశాలనుంచి వచ్చే ఎవరినైనా సరే క్వారంటైన్ లో ఉండాల్సిందేనని నిబంధన విధించారు. ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆఘమేఘాల మీద రెండో రకం కరోనా వైరస్ ముంచుకొస్తే ఏం చేయాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి. మరో వైపు కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఈ వైరస్ రాకుండా చేయడంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయం చర్చిస్తోంది.