30 రోజుల్లో ప్రేమించటం ఎలా?: సినిమా రివ్యూ


‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ టీవీ ప్రేక్షకులకు సుపరిచితుడైన ప్రదీప్‍ను వెండితెరపైకి తెచ్చింది. అతని హీరో వేషానికి అటెన్షన్‍ ఎంత వచ్చి వుండేదనేది అటుంచితే, ‘నీలి నీలి ఆకాశం’ పాట వైరల్‍ అయి ఈ సినిమాను చాలా మంది గుర్తించేట్టు చేసింది.

ఆ పాట ఇచ్చిన నమ్మకంతో సినిమాకు వెళ్లిన వారిని ఎక్కువ సమయం ఎదురుచూడనివ్వకుండా మొదటి పది నిమిషాలలోనే పాటొచ్చేస్తుంది. ఆ పాటే సినిమాకు ట్రంప్‍ కార్డ్ అయినపుడు దానిని మొదటి రీల్లో వేసేయడం కరక్ట్ కాదు. ఆ పాట కోసం కాసేపు ఎదురు చూసేలా చేస్తే పాటకు ఇటువైపు ఎన్ని విసుగెత్తించే సన్నివేశాలు వున్నప్పటికీ ఆ పాటొచ్చినప్పుడు వాటిని ప్రేక్షకులు కొంతవరకు క్షమించడం లేదా విస్మరించడం జరుగుతుంది.

దర్శకుడు మున్నా కథనే విచిత్రంగా రాసుకున్నాడు. హాలీవుడ్‍ సినిమాల్లో ఎక్కువగా కనిపించే బాడీ స్వాపింగ్‍ కాన్సెప్ట్కి మన సినిమాలకు హిట్‍ థీమ్‍ అయిన పునర్జన్మ ఎలిమెంట్‍ జత చేసి ఒక విచిత్రమైన కిచిడీ తయారు చేసాడు.

కథ తయారీలో చిత్రమైన మిశ్రమం వాడిన దర్శకుడు సన్నివేశాలకు సన్నివేశాలను హిట్‍ సినిమాల నుంచి లిఫ్ట్ చేసేసాడు. త్రీ ఇడియట్స్లోని ఒక కీలక సన్నివేశంతో పాటు పటాస్‍లోని ఒక కామెడీ సీన్‍ను ఈ సినిమాలో పెట్టేసుకున్నాడు. అయితే ఎన్ని మిశ్రమాలు కలిపినా, ఎక్కడ్నుంచి కాపీ కొట్టినా ‘ముప్పయ్‍ నిమిషాలు భరించడం ఎలా?’ అని ప్రేక్షకులు తలలు పట్టుకునేట్టు చేసాడు.

కాలేజ్‍ హ్యూమర్‍ పేరిట చూపించినదంతా ఇప్పుడు పాతబడిపోయిన మేటరే. అలాగే ఫ్యామిలీ సీన్స్లో ఎవరికి వారు సన్నివేశాన్ని లేపడానికి పెట్టిన ‘అదనపు శ్రమ’ మెలోడ్రామాగా షేప్‍ తీసుకుంది.

అసలు గత జన్మలో ప్రేమించుకున్న జంట ఒకరి మీద ఒకరికి కోపంతో చనిపోతే ఈ జన్మలో అదే కోపంతో పుట్టి మళ్లీ తమలో దాగివున్న ప్రేమను కనుక్కోవడం అనేది ఏదయితే వుందో వివిధ రకాల అనుభూతిని కలిగిస్తుంది. ఈ రెండు జన్మలను అనుసంధానం చేస్తూ ఒక స్వామీజీ పాత్రను పెట్టారు. ఆ పాత్ర ‘సిద్ధా’ అని తత్వం చెప్పిన ప్రతిసారీ చక్కిలిగింతలు పెట్టుకుని మరీ నవ్వాలనిపిస్తుంది.

చాలా సిల్లీగా అనిపించే ఎన్నో సన్నివేశాలను దర్శకుడు ఎంతో సీరియస్‍గా మలిచేసాడు. ఆ రసానుభూతి ప్రేక్షకులు ఫీలౌతారని బలంగా నమ్మేసాడు. ఫస్ట్ హాఫ్‍ వరకు విషయం లేక విసిగించే ఈ చిత్రం ఆ తర్వాత విషయం ఎక్కువై నెత్తి మీద మొత్తేస్తుంటుంది.

అబ్బాయి, అమ్మాయి ఒకరి బాడీలోకి ఒకరు మారిపోగా, వారు ఒకరినొకరు బాధ పెట్టుకోవడానికి చేసే పనులు చిరాకు పెడతాయి. ద్వితియార్థంలో వారు స్నేహితులుగా మారడానికి, ఆ తర్వాత ఒకరి విజయం ఒకరు కాంక్షించడానికి తీసుకునే సమయం తెరపై అరవై నిమిషాలే అయినా కానీ అరవై రోజుల పాటు చూసిన భావన కలుగుతుంది.

ప్రదీప్‍ హీరో కావాలనేదే తన కల అని చెప్పాడు. మరి హీరోగా మారడానికి ఇలాంటి చిత్రమైన కథ ఎందుకు ఎంచుకున్నాడనేది అర్థం కాదు. కాసేపు మాత్రమే కనిపించే గత జన్మ తాలూకు సన్నివేశాలలో ప్రదీప్‍ బాగానే చేసాడు. అమృతా అయ్యర్‍ మాత్రం మగాడి లక్షణాలు చూపించే ప్రయత్నంలో చాలా ఓవరాక్షన్‍ చేసింది.

ఓటిటి సినిమాల్లో హాస్యం పండించిన హర్ష ఈ సినిమాలో ఫుల్‍ లెంగ్త్ కనిపించినా నవ్వించలేకపోయాడు. సాంకేతిక విభాగంలో సినిమాటోగ్రఫీ బాగుంది. అనూప్‍ పాటలలో నీలి నీలి ఆకాశం ఈ సినిమానే మోసింది. ఈ చిత్రానికి వచ్చే ఓపెనింగ్స్లో సింహ భాగం ఆ పాట అకౌంట్‍లోకే వెళుతుంది.

దర్శకుడు మున్నా చాలా విషయాలను ఒకే కథలో ఇమిడ్చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలని చూసాడు. కానీ ‘రకరకాలుగా వుంది మాస్టారు’ అనేట్టు చేసాడు. ఆ బాడీ స్వాపింగ్‍ అనేది కథలో కీలకాంశం అనుకున్నప్పుడు దానిని ఇంకాస్త ముందుకి జరుపుకున్నట్టయితే సెకండ్‍ హాఫ్‍ అంత భారంగా మారేది కాదు.

‘పాటంత బాగుంటుంది సినిమా’ అంటూ ప్రచారం చేసుకున్నారు కానీ పాట తప్ప ఇంకేమీ లేని ఈ సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అనేది తెలిసినా, తెలియకపోయినా… చూసింది ‘మూడు నిమిషాల్లో మరచిపోవటం ఎలా?’ అనేది మాత్రం ఈ సినిమాకెళ్లిన వారికి తప్పనిసరిగా తెలియాల్సిన ట్రిక్కు. ప్రదీప్‍కి వున్న టీవీ ఫాలోయింగ్‍ ప్లస్‍ సిడ్‍ శ్రీరామ్‍ సాంగ్‍ ఈ చిత్రానికి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టవచ్చు కానీ టికెట్లు కొన్న చాలా మందికి బోనస్‍గా తలపోటు కూడా ఖాయం.

సినిమా రివ్యూ: 30 రోజుల్లో ప్రేమించటం ఎలా?
రేటింగ్‍: 1.5/5
బ్యానర్‍: ఎస్‍.వి. ప్రొడక్షన్స్
తారాగణం: ప్రదీప్‍ మాచిరాజు, అమృత అయ్యర్‍, శుభలేఖ సుధాకర్‍, పోసాని కృష్ణమురళి, హర్ష చెముడు, భద్రం, శివన్నారాయణ, హేమ తదితరులు
మ్యూజిక్‍: అనూప్‍ రూబెన్స్
ఎడిటింగ్‍: కె.ఎల్‍. ప్రవీణ్‍
ఛాయాగ్రహణం: దాశరధి శివేంద్ర
నిర్మాత: ఎస్‍.వి. బాబు
రచన, దర్శకత్వం: ఫణి ప్రదీప్‍ (మున్నా ధూలిపూడి)
విడుదల తేదీ: జనవరి 29, 2021

About The Author