చిరంజీవిని మరింత పలుచన చేస్తున్న పవన్!
మళ్లీ పాత ఆటే మొదలుపెడుతున్నారు మెగా సోదరులు. వీళ్ల రాజకీయం జనాలు చూడనిది కాదు, రాజకీయాల్లోకి రావడమూ జరిగింది, ఒక్కో ఎన్నికల సమయంలో ఒక్కో సినిమాను చూపించడమూ జరిగింది. 2009, 2014, 2019 ఎన్నికల సమయంలో.. మెగా ఫ్యామిలీ నుంచి హీరోల రాజకీయం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.
2009లో కట్టగట్టుకుని వచ్చారు. 2014లో చిరంజీవి ఒక పార్టీ తరఫున, పవన్ కల్యాణ్ మరో పార్టీల తరఫున వెళ్లారు. ఇక 2019 నాటికి పవన్ కల్యాణ్ కొత్త వేషంలో వస్తే.. జనాలకే విసుగొచ్చి ఒకటికి రెండు చోట్ల ఎమ్మెల్యేగా ఓడించారు.
కేవలం మెగా హీరోల రాజకీయం పట్లే కాదు.. సినిమా వాళ్లకే రాజకీయంగా ప్రజల్లో ఆదరణ లభించే రోజులు కావివి. తమిళనాడు ఉదంతాలు కూడా ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
ఇప్పుడు మళ్లీ పవన్ కల్యాణ్ మొదలుపెట్టారు. చిరంజీవి వస్తారో రారో తెలీదు కానీ.. వస్తారన్నట్టుగా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారు. సినిమాల్లోనే ఉండి ఉంటే చిరంజీవి మెగాస్టార్. ఆయన రాజకీయల్లోకి వచ్చి ఉంటే అద్భుతాలు జరిగేవని చెప్పుకోవడానికి అలాగే ఉండేది. రజనీకాంత్ మాదిరి అనమాట. లేస్తే మనిషిని కాదు అని చెప్పుకోవడమే హీరోలకు, హీరోల అభిమానులకు బాగుంటుంది. తమిళనాట రజనీ, విజయ్ లాంటి వాళ్లు చేస్తున్న పని ఇదే. తీరా లేస్తే.. అసలు కథ బయటపడుతుంది.
ముఖ్యమంత్రి పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని వచ్చిన చిరంజీవి ఆ ప్రయత్నంలో విఫలం కావడంలో కూడా తప్పేం కాదు కానీ, రాజ్యసభ సభ్యత్వానికి పార్టీని తాకట్టు పెట్టాడనే అపప్రద మాత్రం చెరిపితే చెరిగిపోయేది కాదు. సినిమాల్లో రాజకీయాలతో మొదలుపెడితే బోలెడన్ని నీతులు చెప్పే హీరోలకు తగని పని అది. అందుకే చిరంజీవి చివరకు అయినా తప్పుకున్నారు. ఆయన మనసులో ఏమున్నా జనాల ముందు మళ్లీ రాజకీయాల ఊసు ఎత్తడం లేదు. జరిగిన కామెడీ చాలని అనుకోవచ్చు.
అయితే పవన్ కల్యాణ్ మాత్రం తన అన్నయ్యను జనాల దృష్టిలో ఆ మాత్రం హుందాగా కూడా నిలిపేలా లేడు. రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలై..అనవిగాని మాటలు మాట్లాడి తన పార్టీని రాష్ట్రమంతా కలిసి ఒక్క చోట మాత్రమే గెలిపించుకోగలిగిన పవన్ కల్యాణ్.. ఇక కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న జనసేనను కాపాడుకోవడానికి చిరంజీవి పేరును జపిస్తున్నట్టుగా ఉన్నారు. ఒక అన్నగా చిరంజీవి తన తమ్ముడి రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తూ ఉండొచ్చు.
చర్చలు చేస్తూ ఉండొచ్చు. అయితే.. అదే మాటే జనం ముందుకు వచ్చి చెబితే మాత్రం అప్పుడు మొదలవుతుంది అసలు కామెడీ. ఆల్రెడీ చిరంజీవి, పవన్ కల్యాణ్, ఇంకా ఇతర మెగా హీరోల కాంబినేషన్లో వచ్చిన మల్టీస్టారర్ సినిమా ప్రజారాజ్యానికి దక్కిన ఆదరణ ఏమిటో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వీళ్ల పాలిటిక్స్ మరింత కామెడీ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ చిరంజీవి పేరెత్తడం పవన్ కల్యాణ్ రాజకీయ కామెడీకి కొనసాగింపు మాత్రమే.