భర్తను చంపిన భార్య… పెన్షన్ కి అర్హురాలే…
భర్తను చంపిన భార్య ఫ్యామిలీ పెన్షన్ కు అర్హురాలా..? ఈ విషయంపై పంజాబ్, హర్యాణా హైకోర్టు అసాధారణమైన తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న తర్సిం సింగ్ ను, ఆయన భార్య బల్జిత్ కౌర్ 13ఏళ్ల క్రితం దారుణంగా హత్య చేసింది. ఈ హత్య కేసుకి సంబంధించి ఆమెను 2011లో జైలుకి పంపించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న భర్త చనిపోవడంతో ఆమెకు కొంతకాలం పెన్షన్ ఇచ్చినా, ఆ తర్వాత భర్తను చంపిన కేసు రుజువు కావడంతో 2011నుంచి ఆమెకు పెన్షన్ ఆపివేశారు. దీనిపై బల్జిత్ కౌర్ కోర్టుకెక్కింది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న భర్తను చంపిన కేసులో భార్య దోషిగా తేలి శిక్ష అనుభవించడంతో పెన్షన్ నిలిపివేశామని, ఆమె పెన్షన్ కు అర్హులారు కాదని ప్రభుత్వం వాదించింది. అయితే కోర్టు మాత్రం ఇందుకు భిన్నంగా తీర్పు చెప్పింది.
ఆమెకు 2నెలల లోపల పాత బకాయిలతో సహా ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాల్సిందేనని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 1972 పెన్షన్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న వ్యక్తి చనిపోతే వితంతువు అయిన ఆయన భార్యకు పెన్షన్ ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఆమె మరో పెళ్లి చేసుకున్నా, పెన్షన్ కు అర్హురాలని స్పష్టం చేశారు. ఆమె భర్తను చంపిందనన్న కారణంతో పెన్షన్ నిలుపుదల చేయడం మంచిది కాదని, నిబంధనల ప్రకారం ఆమెకు పెన్షన్ ఇచ్చేయాలని స్పష్టం చేసిన హైకోర్టు ఈ విషయంలో ప్రభుత్వం చేసిన పని మంచిది కాదని, తక్షణమే ఆమెకు బకాయిలు చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.