రాతి గుండెలను సైతం కరిగించే యదార్ధ గాధ ఇది….


అది జనవరి 24 వ తేదీ.కూతురు పెళ్లి చూపులు ముగిశాయి.ఒక్కటవ్వబోతున్న ఇద్దరి మనసులు, చూపులు కలిశాయి.ఇక తాంబూలాలిచ్చిపుచ్చుకోవడమే తరువాయి.ఇంతలోనే నాన్న భావోద్వాగానికి గురయ్యాడు.అల్లారు ముద్దుగా పెంచిన చిట్టితల్లి దూరమవుతుందని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యాడు.తనను విడిచి వెళుతుందంటూ ఆవేదనకు లోనయ్యాడు.అదేంటీ… నేనూ ఓ ఇంటి నుంచి వచ్చిన దాన్నే కదా….ఏనాడైనా బిడ్డ అత్తారింటికి వెళ్ళేదే కదా అంటూ భార్య ఓదార్చింది.దీంతో ఆ కన్నీళ్లను కాస్తా ఆనంద భాష్పాలుగా మలుచుకున్నాడు నాన్న.అయ్యయ్యో అదేం లేదు ఎంతైనా బాధ ఉంటుంది కదూ.ఇగో ఆ ఫోటోలో చూడు నా చిట్టి తల్లిని (చిన్ననాటి ఫోటో చూపిస్తూ)ఎంత గారాభం చేసేదో. స్కూల్ కు వెళ్ళనంటూ నా చేయి పట్టుకుని ఎంత మారాం చేసేది. ఆ ఫోటో చూడు నా ( గుండెలపై హత్తుకుని ఉన్న ఫోటో చూపిస్తూ) ఎంత కళ ఉంధో నా బంగారు తల్లికి.అవన్నీ గుర్తొచ్చి కొంచెం బాధగా ఉందంతే (కన్నీళ్లు తుడుచుకుంటూ). అవునులే ఎప్పటికైనా అది మనల్ని వదిలి అత్తారింటికి వెళ్లేదే కదా (చిరునవ్వుతో)……ఏదైతేనేమ్.నా కూతురి పెళ్లి ఘనంగా జరిపించాలి.ఆకాశమంత పందిరి వేయాలి.నా కూతురి పెళ్లి వేడుకలు చూసి భూ దేవి సైతం గర్వపడాలి.నా బిడ్డకు నేనిచ్చే బహుమానం అంటూ ఆ తండ్రి గొప్పగా చెప్పాడు.

అంతలోనే అంతులేని విషాదం. ఏ తండ్రి తట్టుకోలేని ఘోరం.ఇది అబద్ధమైతే బాగుండని అంతా కోరుకునే పరిస్థితి.ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన ఆ కూతురు ఇక లేదు.పెళ్లి చూపులయిన రెండు రోజులకే కూతురు రోడ్డు ప్రమాదంలో చనిపోయింది.స్కూటీపై వెళుతుండగా బస్సు ఢీకొట్టింది. దీంతో అత్తారింటికి వెళుతుంటేనే తట్టుకోలేని ఆ కన్న తండ్రి గుండె….కన్న కూతురు కానరాని లోకాలకు వెళ్లడంపై తల్లడిల్లి పోయింది.కొద్దిరోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పులు మోగాల్సి వచ్చింది. పెళ్లి కూతురిగా ముస్థాభై..పెళ్లి పల్లకిలో ఊరేగాల్సింది పోయి….పాడెపై శ్మశానికి పయణమయ్యింది.ఇప్పుడీ ఘటన బిడ్డలున్న కన్న తల్లిదండ్రులందరినే కాదు రాతి గుండెలను సైతం కరిగిస్తుంది.అందరినీ కంట తడిపెట్టిస్తుంది.చివరగా ఈ తండ్రికొచ్చిన కష్టం మరే తండ్రికి రావొద్దని మాత్రం అందరం కోరుకుందాం.దయచేసి ఆడపిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు జర జాగ్రత్త.అవగాహన లేమీతో డ్రైవింగ్ చేయకండి .డ్రైవింగ్ లో హెల్మెట్ ధరించడం అస్సలు మర్చిపోకండి .ఎన్నో ఆశలు,ఆశయాలతో ఉన్న మీ కన్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగల్చ వద్దని కోరుకుంటూ గుండె నిబ్బరం చేసుకుని, కన్నీళ్లను దిగమింగుకుంటూ,మీకేమీ కాకున్నా…ఆడపిల్లల తండ్రిగా రాసుకున్న మీ కిరణ్ రెడ్డి వరకాంతం. (ఐన్యూస్ జర్నలిస్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లా).

నోట్ : వీరు ఉండేది హైద్రాబాద్ పెద్ద అంబర్ పేట.రోడ్డు ప్రమాదం యూసఫ్ గూడలో జరిగింది.

About The Author