కొండమీద కృష్ణుడి వెన్నముద్ద!
చెన్నై సమీపంలోని #మహాబలిపురం వెళ్లినవాళ్లంతా కృష్ణుడి వెన్నముద్దగా పేరొందిన రాయిని తప్పక సందర్శిస్తారు. నున్నని కొండరాతి అంచుమీద ఐదుమీటర్ల వ్యాసం, 250 టన్నుల బరువుతో గుండ్రంగా ఉన్న ఆ రాయి ఎటూ దొర్లకుండా నిలిచి ఉండటం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. అది ఎలా నిలిచి ఉందన్నది ఏ భౌతిక శాస్త్ర సిద్ధాంతానికీ అందడం లేదు సరికదా, సహజంగా ఏర్పడి ఉంటుందన్న విషయాన్నీ నిపుణులు కొట్టిపడేస్తున్నారు. అలాగని భారీ క్రేన్లున్న ఈ కాలంలోనూ అంత బరువున్న రాయిని కొండ అంచుకు చేర్చడం సాధ్యం కాదు కదా, వేల ఏళ్ల క్రితం అక్కడ ఎలా ఉంచారనేదీ ఎవరి ఊహకీ అందడం లేదు. దాన్ని కదిపేందుకు ఎందరో రకరకాలుగా ప్రయత్నించారు కానీ ఏదీ ఫలించలేదు.
1908లో అప్పటి మద్రాసు గవర్నరు ప్రకృతి వైపరీత్యాల కారణంగా అది దొర్లితే చుట్టుపక్కల ఇళ్లకు ప్రమాదకరం అని భావించి ఏడు ఏనుగులతో దాన్ని కదిలించేందుకు ప్రయత్నించగా- అంగుళం కూడా కదలలేదట. దాంతో భారత ప్రభుత్వం మరోసారి ఆ ప్రయత్నం చేయలేదు. వెన్నప్రియుడైన బాలకృష్ణుడు వెన్నముద్దను దొంగిలించి, ఇక్కడ పెట్టుకుని తినేవాడనీ అదే అలా పెరిగి పెరిగి రాయిగా మారిందనే పౌరాణిక గాథ ఆధారంగా ‘కృష్ణుడి వెన్నముద్ద’ అనీ; ఆకాశ దేవతలే అక్కడ ఉంచారనీ లేదూ ఆకాశంలోంచి జారిపడిందనే ఊహాగానాల వల్ల ‘స్టోన్ ఆఫ్ స్కై గాడ్’ అనీ పిలుస్తున్నారే తప్ప దాని వెనకున్న మర్మం ఏమిటనేది ఇంతవరకూ ఎవరికీ అంతుబట్టలేదు.