సిగ్గుమాలిన మాటలు కావా ఇవి?


ఫెడరల్ వ్యవస్థ అంటే మన ఎంపీలకు, రాజకీయ వారసులకు అంతగా అర్థం అయినట్లు లేదు. రాష్ట్రాల నుంచి కాకుండా నేరుగా కేంధ్రం పన్నులు వసూలు చేసి ఎవరి వాటా వారికి ఇవ్వడం, మిగిలిన అభివృద్ది పనులను అన్ని రాష్ట్రాలకు ప్రయారిటీ బేసిస్ లో కేటాయించడం అన్నది మరచిపోయారు.
ఎవరు కేంద్రంలో పెత్తనంలో వుంటే వారి ఇష్టం అన్నట్లు అయిపోయింది. మనం మన రాష్ట్రానికి ఇవి ఇవ్వండి అని అడగాలా? పోనీ అడుగుతాం. ఆ సంగతి అలా వుంచండి. ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా?
కేంద్రంలో పాలించేది ఓ రాజకీయ పార్టీనే కదా. దానికీ ఓట్లు కావాలి. దానికీ రాష్ట్రంలో నాయకులు వున్నారు. వారూ ప్రజల మధ్య తిరుగుతూ వుంటారు. మరి వారి సంగతేమిటి?
బడ్జెట్ లో కేటాయింపులు అన్నవి అరచి గోల చేసి, రాజీనామ చేస్తామని బెదిరించి, ధర్నాలు చేసి, నిరసనలు చేస్తేనే వస్తాయ? లేదంటే రావా? అలా చేయకపోవడం రాష్ట్రాల్లోని పాలక పక్షాల తప్పు అంతే తప్ప ఇవ్వని కేంద్రానిది కాదు అంటున్నారు విపక్షల నాయకులు. చిత్రంగా వుంది కదా? ఇలాంటి వాళ్లు వున్నారనే కదా. కేంద్రం కూడా అలుసుగా వున్నది. రాష్ట్రాలను లైట్ తీసుకుంటున్నది?
కేంద్ర బడ్జెట్ వచ్చింది. ఎన్నికలు వున్న తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాలకు కేటాయింపులు బలంగా ఇవ్వడమే కాదు, బడ్జెట్ లో ఆయా భాషల కవుల సూక్తులు కూడా వల్లించారు ఆర్థికమంత్రి. ఆయ భాషల కవుల మీద ప్రేమ కాదు, ఎన్నికల అవసరం. తెలుగు రాష్ట్రాలకు ఏమీ ఇవ్వలేదు. అదేం పెద్దం వింతా కాదు. అనుకోనిదీ కాదు. గత ఆరేడేళ్లుగా ఇలాగే జరుగుతోంది.
మరి ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రలో పాలక, విపక్షాలు ఏమన్నాయి? ఇది అన్యాయం అని గొంతెత్తింది అధికార వైకాపా. అబ్బే బడ్జెట్ చాలా బాగుంది. ఆరోగ్యానికి చాలా ప్రయారిటీ ఇచ్చారు అన్నది భాజపా మిత్ర పక్షం జనసేన. అబ్బే అసలు తప్పంతా వైకాపాదే. వాళ్లు పోరాడతాం అన్నారు. 21 మంది ఎంపీలు వున్నారు. కేసుల కోసం సాగిలపడ్డారు. లేదూ అంటే కేంద్రం కోట్లకు కోట్లు కుమ్మరించేసేది అన్న రీతిలో స్పందించారు. ఎవరు తేదేపా రాజకీయ వారసుడు లోకేష్ నాయుడు. అలాగే ఎంపీ గల్లా జయదేవ్ గారు.
పోనీ లోకేష్ నాయుడు గారికి అంటే ట్విట్టర్ తప్ప మరో వెన్యూ లేదు. ఆయనేం మాట్లాడలేదు. జయదేవ్ గారు లోక్ సభలో విరగదీసే రేంజ్ లో ప్రసంగాలు చేయగల సత్తా వున్నవారు కదా. ఆయన కూడా ఇలా మాట్లాడడం ఏమిటి? అటు లోకేష్ నాయుడు కానీ ఇటు గల్లా జయదేవ్ కానీ తమ ప్రకటనల్లో భాజపా, కేంద్రం, మోడీ అలాంటి పదాలు పొరపాటున కూడా రాకుండా జాగ్రత్త పడ్డారు. తమ మాటల తూటాలు అన్నీ వైకాపా మీద ఎక్కు పెట్టారు.
అంతే తప్ప తాము రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపు ఇవ్వడం కానీ, ఢిల్లీలో ప్రదర్శకు రైళ్లు వేసుకుని వెళ్తామని కానీ, ఓ రోజు బంద్ పిలుపు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయలేదు పొరపాటున చేసినా వైకాపా చాతకానితనానికి నిరసనగా అంటారు కానీ కేంద్రం సవతి ప్రేమకు నిరసనగా అని మాత్రం అనరు. అలా అంటే ఇంకేమైనా వుందా? మోడీకి కోపం వస్తుంది. అసలే భాజపాతో కలవాలి అనుకుంటూ వుంటే ఆ అవకాశం రావడం లేదు. ఇప్పుడు కేంద్రాన్ని, మోడీని టార్గెట్ చేస్తే ఆ తలుపులు పూర్తిగా మూసుకుపోతాయి.
అన్నట్లు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన అనుభవం వున్న చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు కేంద్ర బడ్జెట్ మీద పెదవి విప్పలేదు. అదే అసలు సిసలు కొసమెరుపు.

About The Author