హైదరాబాద్‌ మహానగరంలో 25 డబుల్‌ డెక్కర్లు


గతంలో నగరానికి ప్రత్యేకాకర్షణగా ఉండి నష్టాల కారణంగా కనుమరుగైన డబుల్‌ డెక్కర్‌ బస్సులు త్వరలో నగరవాసులకు కనువిందు చేయబోతున్నాయి. మరో రెండు నెలల్లో బస్సులు సిటీ రోడ్లపై దూసుకుపోనున్నాయి. ప్రయోగాత్మకంగా 25 బస్సులు తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు బస్సుల కోసం టెండర్లు కూడా ఆహ్వానించింది. ఈనెల 18న ప్రీ బిడ్‌ సమావేశాన్ని నిర్వహించి, బస్సులు ఎలా ఉండాలన్న విషయంలో ఆ సమావేశంలో తయారీదారులకు స్పష్టం చేయనుంది. రెండు నెలల క్రితం నగరవాసి ఒకరు డబుల్‌ డెక్కర్‌ బస్సులను గుర్తు చేసుకుంటూ నాటి బస్సు ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్‌ చేశాడు.దీనికి వెంటనే స్పందించిన కేటీఆర్, తనకు డబుల్‌ డెక్కర్‌ బస్సులతో ఉన్న అనుభూతులను నెమరేసుకుంటూ ‘అప్పట్లో డబుల్‌ డెక్కర్లను ఎందుకు ఉపసంహరించుకున్నారో నాకు తెలియదు, వాటిని మళ్లీ నడిపే అవకాశం ఉందా’ అని ప్రశ్నిస్తూ దాన్ని రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ట్యాగ్‌ చేశారు. దీనికి స్పందించిన ఆయన, వెంటనే ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మతో మాట్లాడి, ప్రయోగాత్మకంగా కొన్ని బస్సులు తిప్పే అవకాశం ఉంటే పరిశీలించాలని ఆదేశించారు. రూట్‌ నెం.229 (సికింద్రాబాద్‌ – మేడ్చల్‌ వయా సుచిత్ర), రూట్‌ నెం.219 (సికింద్రాబాద్‌–పటాన్‌చెరు వయా బాలానగర్‌ క్రాస్‌ రోడ్డు), రూట్‌ నెం. 218 (కోఠి–పటాన్‌చెరు వయా అమీర్‌పేట), రూట్‌ నెం.9ఎక్స్‌ (సీబీఎస్‌–జీడిమెట్ల వయా అమీర్‌పేట), రూట్‌ నెం.118 (అఫ్జల్‌గంజ్‌–మెహిదీపట్నం)లను ఎంపిక చేశారు. దుర్గం చెరువుపై కొత్తగా కేబుల్‌ బ్రిడ్జి మీదుగా ఓ బస్సు తిరిగేలా ప్లాన్‌ చేస్తున్నారు.

About The Author