పెట్రో సెగ : కేంద్రంపై బీజేపీ ఎంపీ వ్యంగ్యాస్త్రం
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల పెట్రోల్ ధరలు సెంచరీ దాటగా.. తాజాగా బడ్జెట్‌లో కేంద్రం పెట్రోల్, డీజిల్ మీద వ్యవసాయ సెస్ విధిస్తున్నుట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవ్వగా.. ఈ సెస్‌ను సుంకం నుంచి మినహాయిస్తామని… వినియోగదారులపై ఈ భారం మోపమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లకు సంబంధించి ఓ వ్యంగ్య ఫోటోని ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇక దీనిలో ‘‘రామ జన్మభూమిగా భావించే ఇండియాలో లీటర్ పెట్రోల్ ధర 93 రూపాయలు.. సీతమ్మవారు పుట్టిన దేశం నేపాల్‌లో లీటర్ పెట్రోల్ ధర 53 రూపాయలు.. అదే రావణుడి లంకలో పెట్రోల్ లీటర్ 51 రూపాయలు మాత్రమే’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఇక దేశంలో ఇంధన రేట్లు పెరిగిన నాటి నుంచి ఈ ఫోటో వైరలవ్వగా.. సుబ్రహ్యణ్య స్వామి ట్వీట్ చేయడంతో మరోసారి ఇది వైరలవుతోంది. ఇక దీనిపై నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు.