మరోసారి పాక్ గుట్టు రట్టయ్యింది…
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్ గుట్టు రట్టయ్యింది. ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడం లేదన్న అక్కడి ప్రభుత్వం, సైన్యం బుకాయింపు వట్టిదేనని మరోసారి నిరూపితమైంది. అమెరికా మట్టుబెట్టిన అల్‌ఖైదా కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు మధ్య సంబంధాలుండేవని ఓ మాజీ ఉన్నతాధికారి కుండబద్దలు కొట్టారు. షరీఫ్‌కు లాడెన్ ఆర్థిక సాయం అందజేసేవారని వెల్లడించారు.
‘‘అవును, ఆయన(లాడెన్) నవాజ్ షరీఫ్‌కు ఓ విషయంలో అండగా నిలిచారు. ఏదేమైనా అదో పెద్ద సంక్లిష్టమైన విషయం. లాడెన్ తరచూ షరీఫ్‌కు ఆర్థిక సాయం చేసేవారు’’ అంటూ గతంలో అమెరికాలో పనిచేసిన పాకిస్థాన్ రాయబారి అబిదా హుస్సేన్ నిజాన్ని బయటపెట్టారు. ఓ ప్రముఖ ప్రైవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. షరీఫ్ హయాంలో అబిదా హుస్సేన్ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
నవాజ్ షరీఫ్‌పై ఇటీవల అధికార పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌కు చెందిన నేత ఫరూఖ్ అబీబ్ తీవ్ర ఆరోపణలు చేశారు. విదేశీ విరాళాలకు షరీఫే శ్రీకారం చుట్టారన్నారు. అలా లాడెన్ నుంచి 10 మిలియన్ డాలర్లు తీసుకొని.. అప్పటి బెనజీర్ భుట్టో ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నించారన్నారు. దీనిపై అబిదా హుస్సేన్‌ను తాజాగా ప్రశ్నించగా.. అసలు విషయం బయటపెట్టారు. మూడు దఫాలు పాక్ ప్రధాని బాధ్యతలు నిర్వర్తించిన నవాజ్ షరీఫ్ కశ్మీర్‌లో జిహాదీ కార్యక్రమాలకు మద్దతిచ్చేవారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకు కావాల్సిన నిధులను లాడెన్ నుంచే తీసుకునేవారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా అబిదా చెప్పిన విషయాలతో అవన్నీ నిజమేనన్న విషయం స్పష్టమవుతోంది. ఇక పాక్ ప్రభుత్వంపై సైన్యానిదే పెత్తనం అన్న విషయం తెలిసిందే. అంటే షరీఫ్-లాడెన్ సంబంధాలకు సైన్యం అండ కూడా ఉందనే అర్థం చేసుకోవాలి! దీన్నిబట్టి పాక్ ఉగ్రముఠాలకు అక్కడి ప్రభుత్వం, సైన్యం మద్దతు ఉందని స్పష్టమవుతోంది.
అమెరికాలో డబ్ల్యూటీవో సెంటర్‌పై దాడిలో ప్రధాన సూత్రధారి అయిన బిన్ లాడెన్‌ను అమెరికా నేవీ సీల్స్ బృందం 2011, మే నెలలో పాకిస్థాన్ భూభాగంలోనే హతమార్చిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ పాలకులే అతడికి ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉగ్రవాదం విషయంలో పాక్ నిజస్వరూపం గతంలోనూ పలు సందర్భాల్లో బయటపడింది. లాడెన్‌ను ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఏకంగా ఓసారి అమరుడిగా కీర్తించారు. మరో సమయంలో గత ప్రభుత్వాలను విమర్శించే క్రమంలో దాదాపు 30వేల నుంచి 40వేల మంది ఉగ్రవాదులు పాక్‌లో శిక్షణ పొందుతున్నారని బహిరంగంగా అంగీకరించారు.
ఇక అవినీతి ఆరోపణల కేసులో 2017లో పదవీచ్యుతుడైన నవాజ్ షరీఫ్ ప్రస్తుతం లండన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అనారోగ్య కారణాలతో గత కొన్ని నెలలగా అక్కడే తలదాచుకుంటున్నారు.