తిరుమల సమాచారం…
రథసప్తమినాడు దర్శన టోకెన్లు గల భక్తులకు మాత్రమే అనుమతి :
డయల్ యువర్ ఈవోలో టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి
కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని రథసప్తమి నాడు దర్శన టికెట్లు ఉన్నభక్తులను మాత్రమే యదావిధిగా తిరుమలకు అనుమతించడం జరుగుతుందని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. చెన్నైకి చెందిన సెల్వంతో పాటు పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో పైవిధంగా సమాధానమిచ్చారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.
1. మల్లిక – నెల్లూరు
ప్రశ్న: తిరుమలలో పైపులైన్ల లీకేజీలను నివారించి నీటి వృథాను అరికట్టండి ?
ఈవో : వెంటనే మరమ్మతులు చేపట్టి నీరు వృథా కాకుండా చూస్తాం.
2. సునీల్ – సూర్యాపేట
ప్రశ్న: తిరుమలలోని పద్మావతి విచారణ కార్యాలయంలో గదుల కేటాయింపు డిస్‌ప్లే బోర్డు ఆఫ్‌లో ఉంది. విఐపి సిఫార్సులకు మాత్రమే గదులు కేటాయిస్తున్నారు?
ఈవో : పద్మావతి విచారణ కార్యాలయంలో భక్తులు నేరుగా వెళ్లి గదులు పొందేలా ఏర్పాట్లు చేస్తాం. డిస్‌ప్లే బోర్డులో గదుల వివరాలు తెలియజేస్తాం.
3. కృష్ణమోహన్ – ఖమ్మం
ప్రశ్న: రూ.300/- దర్శన టికెట్లను సమాచార కేంద్రాలు, ఈ-దర్శన్ కౌంటర్లలో కూడా ఇవ్వండి ?
ఈవో : పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటాం.
4. లక్ష్మీ – అనంతపురం, తులసిరెడ్డి – హైదరాబాద్
ప్రశ్న: వైకుంఠ ఏకాదశి సందర్భంగా చక్కటి దర్శనం కల్పించినందుకు ధన్యవాదాలు. సప్తగిరి మాసపత్రిక సరిగా చేరడం లేదు. పత్రికలో శ్రీవారి రోజువారీ సేవలు, కైంకర్యాలు, నెలవారీ కార్యక్రమాలు అందించండి.
ఈవో : సప్తగిరి మాసపత్రిక క్రమం తప్పకుండా అందేలా చూస్తాం. ఆయా వివరాలను పొందుపరుస్తాం.
5. కోటేశ్వరరావు – రాపూరు, రాజు – చిత్తూరు
ప్రశ్న: తిరుమలలో జరిగే తీర్థ ముక్కోటి కార్యక్రమాలకు భక్తులను అనుమతించండి?
ఈవో : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు తీర్థాలకు ఇంకా భక్తులను అనుమతించడం లేదు. ఈ విషయాన్ని పునఃసమీక్షిస్తాం.
6. వేణుగోపాల్ – గుంతకల్
ప్రశ్న: నూతనంగా 500 ఆలయాలు నిర్మిస్తామని టిటిడి ప్రకటించింది. మా గ్రామంలో ఆలయం నిర్మించండి?
ఈవో : మిమ్మల్ని ఫోన్‌లో సంప్రదించి వివరాలు తెలియజేస్తాం.
7. సతీష్ – కడప
ప్రశ్న: ఆర్‌టిసి బస్సులో ప్రయాణించే భక్తులకు రూ.300/ – టికెట్ల కేటాయింపు వాస్తవమేనా?
ఈవో : తెలుగు రాష్ట్రాల అర్‌టిసి సంస్థలతోపాటు తమిళనాడు, కర్ణాటక ఆర్‌టిసి సంస్థలకు కూడా రూ.300/- టికెట్లు కేటాయించాం. త్వరలో వారు ప్రయాణికులకు కేటాయిస్తారు.
8. శ్రీలత – హైదరాబాద్
ప్రశ్న: హైదరాబాద్ – భువనగిరి మధ్యలో ఒక్క ఆలయం కూడా లేదు. శ్రీవారి ఆలయం నిర్మించండి. ఎస్వీబీసీలో 108 దివ్యక్షేత్రాల గురించి ప్రసారం చేయండి?
ఈవో : ఆలయ నిర్మాణం అంశాన్ని పరిశీలిస్తాం. ఎస్వీబీసీలో 108 దివ్యక్షేత్రాల గురించి ప్రసారం చేస్తాం.
9. రాధిక – నాయుడుపేట, మస్తాన్ రావు – ఒంగోలు
ప్రశ్న: రథసప్తమి పర్వదినం నాటికి రూ.300/- టికెట్లు ఆన్‌లైన్‌లో ఇంకా విడుదల చేయలేదు?
ఈవో : మీకు ఫోనులో వివరాలు తెలుపుతాం.
10. బాపూజీ – విశాఖపట్నం
ప్రశ్న: విశాఖపట్నంలో లడ్డూ ప్రసాదం పంపిణీని తిరిగి ప్రారంభించండి ?
ఈవో : విశాఖలో శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తయింది. మే నెలలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తాం. ఆ తరువాత శ్రీవారి లడ్డూ ప్రసాదం పంపిణీని ప్రారంభిస్తాం.
11. పూర్ణిమ – బెంగళూరు
ప్రశ్న: నెల క్రితం శ్రీవారి దర్శనానికి వచ్చాం. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు తీసుకుంటే మూడు రోజుల తరువాత దర్శనానికి పంపారు.?
ఈవో : ప‌్రస్తుతం రోజుకు 20 వేల సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని కౌంటర్ల ద్వారా కరంట్ బుకింగ్‌లో కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ఆ సమస్య లేదు.
12. అప్పారావు – వైజాగ్
ప్రశ్న: నా వయసు 62 సంవత్సరాలు. వయసు పైబడిన వారికి అభిషేకం టికెట్లు ఇవ్వండి.
ఈవో : ప్రస్తుతానికి ఎలాంటి సేవలు లేవు.
13. శ్రీనివాసులురెడ్డి – నెల్లూరు
ప్రశ్న : ఎస్వీబీసీలో ప్రకటనలు తగ్గించండి.
ఈవో : ఈ ఏడాది మార్చి 31 తరువాత ప్రకటనలు ఉండవు.
14. సత్యనారాయణ – ఒంగోలు
ప్రశ్న: పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ – 1 గా పదవీ విరమణ చేశాను. తిరుమలలో సేవ చేసే అవకాశం కల్పించండి.
ఈవో : తప్పకుండా శ్రీవారి సేవ చేసే అవకాశం కల్పిస్తాం.
15. మధుసూదన్ – అనంతపురం
ప్రశ్న: మా గ్రామంలోని ఆంజనేయస్వామివారి ఆలయ జీర్ణోద్ధరణకు టిటిడి సహకారం అందించండి.
ఈవో : శ్రీవాణి ట్రస్టు ద్వారా పురాతన ఆలయాల మరమ్మతులు, పునర్నిర్మాణం చేస్తాం.
16. గీతా సురేష్ – చెన్నై
ప్రశ్న : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సుప్రభాత సేవ, తిరుమలలో కళ్యాణోత్సవం టికెట్లు ఎలా పొందాలి.
ఈవో : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోవిడ్ – 19 కారణంగా సేవలన్నీ ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆన్‌లైన్ కళ్యాణోత్సవం టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
17. లక్ష్మీ – హైదరాబాద్, గీతా కుమారి – పశ్చిమ గోదావరి
ప్రశ్న : 1. మార్చి నుండి తిరుమల నాదనీరాజనం వేదికపై నిర్వహిస్తున్న మంత్రపారాయణం కార్యక్రమాలు బాగున్నాయి. వీటిని పుస్తక రూపంలో భక్తులకు అందించండి.
2. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనాలు బాగున్నాయి. స్వామివారి దర్శనానంతరం ఆలయంలో అన్నప్రసాదాలు ఇవ్వలేదు. సిబ్బంది మాత్రం ప్రసాదాలు తీసుకెళ్లారు.
ఈవో : శ‌్లోకాల భావం, తాత్పర్యంతో పుస్తక రచన చేయిస్తున్నాం. ప్రసాదాలకు సంబంధించిన విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాము.
18. వెర్రి నాయుడు – తూర్పు గోదావరి
ప్రశ్న : తిరుమలలోని మాడ వీధుల్లో చెప్పులతో తిరగకూడదు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా తిరుమల, తిరుపతిలోని బస్టాండ్లలో చెప్పుల కౌంటర్లు ఏర్పాటు చేయండి.
ఈవో : ఇప్పటికే ఉన్నాయి. అవసరమైన చోట మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తాం.
19. నరేందర్ – వికారాబాద్
ప్రశ్న: వికలాంగులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఎప్పటి నుండి కల్పిస్తారు.
ఈవో : కోవిడ్ – 19 వల్ల ప్రస్తుతం లేదు. మరో నెల రోజుల తరువాత పరిశీలిస్తాం.
20. సుమలత – హైదరాబాద్, మారుతి – వైజాగ్
ప్రశ్న : నందకం విశ్రాంతి భవనంలో గదుల ధర రూ.500 నుండి రూ.1000 లోపు పెట్టండి. సామాన్యులకు సౌకర్యాంగా ఉంటుంది. పిల్లలకు ఉచిత లడ్డూ ఇచ్చే ఏర్పాటు చేయండి.
ఈవో : తిరుమలలో గదుల అద్దె ధరలను సమీక్షిస్తున్నాం. 12 సంవత్సరాలలోపు పిల్లలు దర్శన టికెట్ తీసుకుంటే లడ్డూలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం.
21. సుబ్బలక్ష్మీ – గుంటూరు
ప్రశ్న : శ్రీవారి సేవాటికెట్లు లక్కీ డిప్ పద్ధతిలో ఇస్తున్నారు. పాత విధానంలో ఇవ్వండి.
ఈవో : ప్రస్తుతానికి సేవలు లేవు. పరిశీలిస్తాం.
22. వెంకటరెడ్డి – హైదరాబాద్
ప్రశ్న : డిసెంబర్ 28వ తేదీన కళ్యాణోత్సవం టికెట్‌పై దర్శనానికి వెళ్లాం. మరుసటి రోజు వెళ్తే ప్రసాదం ఇవ్వలేదు. ఆ కల్యాణోత్పవం ప్రసాదం ఇప్పించండి.
ఈవో : ప‌్రసాదం మీకు పంపే ఏర్పాట్లు చేస్తాం.
23. ఆంజియప్పన్ – హొసూర్
ప్రశ్న : ఎస్వీబీసీలో ఉదయం భక్తి పాటలు ప్రసారం చేయండి.
ఈవో : అలాగే ప్రసారం చేస్తాం.
24. వేంకటేశ్వర్లు – హైదరాబాద్
ప్రశ్న : తిరుమలలో ఒక్కరికి గదులు ఇవ్వరు. 62 సంవత్సరాలు దాటిన నాలాంటి వాళ్లకు లాకర్ల వద్ద ఎత్తులో పడుకునే అవకాశం కల్పించండి. అదేవిధంగా దర్శన క్యూలైన్లలో వెస్ట్రన్ టైపు టాయిలెట్లు ఏర్పాటు చేయండి.
ఈవో : వయసు పైబడిన వారికి సౌకర్యంగా ఉండేలా ఈ విషయాలపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్‌రెడ్డి, ఎస్వీబీసీ సీఈవో శ్రీ సురేష్‌కుమార్, ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ(ఎలక్ట్రికల్స్) శ్రీ వేంకటేశ్వర్లు, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఆర్ఆర్.రెడ్డి, డిఎఫ్‌వో శ్రీ చంద్రశేఖర్, డెప్యూటీ ఈవో శ్రీ దామోదరం, విజివో శ్రీ ప్రభాకర్, ఉద్యానవన డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్, హెచ్‌డిపిపి కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్ తదితరులు పాల్గొన్నారు.
———————————————————–
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.