ఐటీ-ఎలక్ట్రానిక్‌ పాలసీపై సీఎం వైఎస్ జగన్‌ సమావేశం


ఐటీ-ఎలక్ట్రానిక్‌ పాలసీపై సీఎం వైఎస్ జగన్‌ సమావేశం నిర్వహించారు. వచ్చే మూడేళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయాన్ని అన్ని గ్రామాలకూ కల్పించాలని చెప్పారు. ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ బలంగా లేకపోతే.. అనుకున్న లక్ష్యాలు సాధించలేమన్నారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలని.. ఇంటర్నెట్‌ లైబ్రరీని ఏర్పాటు చేయాలని, గ్రామంలో ఎవరైనా సరే ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా ఉండాలన్నారు. వర్క్‌ ఫ్రం హోంకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. గ్రామంలోని సచివాలయాలు, ఆర్బీకేలు అన్నీ కూడా ఇంటర్నెట్‌తో అనుసంధానం కావాలన్నారు. దీంతోటు అవసరమైన గృహాలకు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇవ్వాలని చెప్పారు. విశాఖలో ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ పార్క్‌లో హై ఎండ్‌ స్కిల్స్‌ యూనివర్శిటీ, ఇన్‌క్యుబేషన్‌ సెంటర్, ల్యాబ్స్, సీఓఈఎస్, ఐటీ, ఈసీ డిపార్ట్‌మెంట్‌ ఆఫీసు, స్టేట్‌ డేటా సెంటర్, ఐటీ టవర్స్‌ ఉండాలని ఆదేశించారు. విశాఖలో ఏర్పాటు కాబోతున్న యూనివర్శిటీలో రోబోటిక్స్, ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీస్, డేటా అనలిటిక్స్‌ సైన్సెస్, అడ్వాన్స్‌డ్‌ ఎలక్ట్రానిక్స్, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటివనరులు తదితర రంగాల్లో ఐటీ అప్లికేషన్లపై బోధన, పరిశోధన ఉండాలన్నారు. ఇంజినీరింగ్‌ ఇతర సాంకేతిక విద్యను అభ్యసించిన వారికి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకూ ఈ యూనివర్శిటీ ఉపయోగపడాలన్నారు. విశాఖపట్నం, తిరుపతి, బెంగుళూరు సమీపంలో.. మూడుచోట్ల కనీసం 2 వేల ఎకరాల విస్తరణలో ఐటీ కాన్సెప్ట్‌సిటీలను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కొప్పర్తి ఎలక్ట్రానిక్స్‌ పార్క్‌పై దృష్టిపెట్టాలని.. వీలైనన్ని పరిశ్రమలను తీసుకురావాలని, పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పనపై దృష్టిపెట్టాలన్నారు. ఈ సమావేశానికి ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, అధికారులు హాజరయ్యారు.

About The Author