నా కూతురిని ఏ స్కూల్లో చేర్చుకోవడంలేదు…

నా కూతురిని ఏ స్కూల్లో చేర్చుకోవడంలేదు…
శబరిమలై కొండ ఎక్కేందుకు ప్రయత్నించిన టీచర్ ఆవేదన …

గత ఏడాది అక్టోబర్‌లో శబరిమల కొండ ఎక్కడానికి ప్రయత్నించిన బిందు తాంకం కల్యాణి (43) అనే సామాజిక కార్యకర్త, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. హిందూ సంఘాల ఆందోళనలతో వెనక్కి వచ్చేశారు. అయితే, తన కూతురికి పాఠశాలలో అడ్మిషన్‌ లభించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు చదివిన పాఠశాలలో తన కూతురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని, దీంతో ఆ పాఠశాలకు వెళ్లనని చెప్పిందని ఆమె తెలిపారు.
ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… ‘కొన్ని రోజుల క్రితం నేను అనైకట్టి ప్రాంతంలోని విద్యా వనం అనే పాఠశాలకు వెళ్లి మాట్లాడాను. మా కూతురు (11)ని పాఠశాలలో చేర్చుకుంటామని అప్పుడు చెప్పారు. అయితే, నిన్న నా కూతురి అందులో చేర్చేందుకు ఆమెను తీసుకుని వెళ్లాను. ఆ సమయంలో ఆ పాఠశాల గేటు వద్ద దాదాపు 60 మంది ఉన్నారు. వారు అక్కడ ఎందుకు ఉన్నారో మొదట నాకు అర్థం కాలేదు. కొద్దిసేపటి తరువాత నాకు అసలు విషయం అర్థమైంది. నా కూతురికి అడ్మిషన్‌ ఇవ్వొద్దని వారు ఆందోళన నిర్వహించారు’ అని తెలిపారు.
‘అయినప్పటికీ ఆ పాఠశాలలో నా కూతురిని చేర్చుకుంటారని అనుకున్నాను. కానీ, అందుకు వారు నిరాకరించారు. నా కుమార్తెను చేర్చుకుంటే తమకు ఇబ్బందులు తలెత్తుతాయని, ఇతర విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతుందని ఆ పాఠశాల సిబ్బంది అన్నారు. అందులో దాదాపు 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. నా బిడ్డ అందులో చదువుకుంటే, ఆందోళనకారులు తమ పాఠశాలపై దాడి చేస్తారని ఆ సిబ్బంది భయపడుతున్నారు. పిల్లలు చదువుకునే ప్రాంతంలో వారు ఆందోళనలు ఎలా జరుపుతారు? నా కూతురు ఇంతకు ముందు అగాలీలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. ఆమెకు అక్కడ మంచి స్నేహితులు ఉండేవారు. కానీ, శబరిమల కొండ ఎక్కడానికి నేను ప్రయత్నించిన తరువాత నా కుమార్తెకు ఇబ్బందులు మొదలయ్యాయి. తనతో మాట్లాడవద్దని ఇతర పిల్లలకు క్లాస్ ‌టీచర్‌ చెప్పారు. అలాగే, ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వారికి ఇదే విషయాన్ని సూచించారు. నా బిడ్డ మానసిక క్షోభను అనుభవిస్తుందని నేను గుర్తించాను. చివరకు తాను పాఠశాలకు వెళ్లనని చెప్పేసింది. ఆమె పట్ల పాఠశాల ఉపాధ్యాయులు క్రూరంగా ప్రవర్తించారు’ అని కల్యాణి ఆవేదన చెందారు.
కాగా, కల్యాణి శబరిమల కొండ ఎక్కాలని ప్రయత్నించినప్పటి నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆమె పని చేస్తున్న పాఠశాల ముందు ఆందోళనకారులు ఇటీవల ధర్నా కూడా చేశారు. అంతేకాదు, ఆ రాష్ట్ర భాజపా సీనియర్‌ నేత శోభా సురేంద్రన్‌ కూడా కల్యాణి పనిచేస్తున్న పాఠశాలకు వచ్చి ధర్నా చేసి, ఆమెను ‘మావోయిస్టు’గా అభివర్ణించారు. తాను ఉంటున్న అద్దె ఇంటిని కూడా ఖాళీ చేయాలని ఒత్తిడి రాగా, దాన్ని ఖాళీ చేసిన ఆమె కుటుంబం వేరే ప్రాంతానికి వెళ్లి ఉంటోంది.

About The Author