తమిళనాడులో రైతు రుణమాఫీ
తమిళనాడు ప్రభుత్వం రైతులు భారీ ఊరట కల్పించింది. పెద్ద మొత్తంలో వ్యవసాయ రుణాలను రద్దు చేస్తూ రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి శుక్రవారం దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. రూ .12,110 కోట్ల వ్యవసాయ రుణ మాఫీని ప్రకటించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16.43 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 2వ వారంలో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ భావిస్తోందన్న అంచనాల నడుమ సీఎం ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది*
సహకార బ్యాంకుల నుండి రైతులు తీసుకున్న సుమారు రూ .12,110 కోట్ల రుణాలను మాఫీ చేయనున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా అకాలవర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న పంటలకు రూ.1,117 కోట్ల పరిహారాన్ని సీఎం ఇంతకుముందే ప్రకటించారు. దీంతో సుమారు 11 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. తమిళనాడులో ఎడతెరిపి లేని వర్షాలతో భారీగా పంట నష్టానికి దారితీసింది. గతేడాది సాధారణ స్థాయిలతో పోలిస్తే రాష్ట్రంలో 708 శాతం అధిక వర్షపాతం నమోదైంది. పంటకోత దశలో ఉండగా కురిపిన వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు అతలాకుతలమైన సంగతి తెలిసిందే.