సీఎం మార్పు గురించి మాట్లాడటం ఆపండి


సీఎం మార్పు గురించి ఇక మాట్లాడటం ఆపాలని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ సూచించారు. సీఎం మార్పు గురించి వస్తున్న ఊహాగాలను ఆయన కొట్టిపారేశారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ భవన్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ఆయన స్పష్టత నిచ్చారు. ‘తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని, నాకు పదవులు ముఖ్యం కాదు.. ఎన్నో పదవులను తృణప్రాయంగా వదిలేశాను. మరో పదేళ్లు సీఎంగా నేనే ఉంటానని గతంలోనే అసెంబ్లీలో చెప్పాను’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కొత్త సీఎం అంటూ ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఏప్రిల్‌లో టీఆర్‌ఎస్‌ భారీగా బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 12 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించాలని, మార్చి 1 నుంచి పార్టీ కమిటీల ఏర్పాటు ప్రారంభించాలని నేతలకు చెప్పారు. సమావేశంలో పలు అంశాలపై పార్టీ నాయకులతో ఆయన మాట్లాడారు.
*టీఆర్‌ఎస్‌కు ఎవరూ పోటీకాదు..*
టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎవరూ పోటీకాదని సీఎం కేసీఆర్‌ అన్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలు, వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లు, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్సే గెలవాలని కేసీఆర్‌ పార్టీ నేతలకు సూచించారు. త్వరలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. పార్టీ సభ్యత్వం విషయంలో లక్ష్యాన్ని పూర్తిచేయాలని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వాలు చేయించాలన్నారు.

About The Author