రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: సీఎం కేసీఆర్


కేంద్రం విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని చెప్పేవి ఉంటాయి..మరికొన్ని చెప్పనవి ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర అవసరాల కోసం కేంద్రంతో మాట్లాడాల్సి ఉంటుందని తెలిపారు. టీఆర్‌ఎస్‌కు ప్రజల మద్దతు ఉందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణభవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్‌ పలు అంశాలపై మాట్లాడారు.
‘నేను రాష్ట్రాన్ని, పార్టీని కాపాడుకోవాలి. రాష్ట్ర అవసరాల కోసం కేంద్రంతో మాట్లాడాల్సి ఉంటుంది. రెండు నెలల పాటు ప్రతి జిల్లా తిరుగుతా. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వ్యవహారశైలి వివాదాస్పదమవుతోంది. కిందిస్థాయి కార్యకర్తలను గౌరవించాలి. తర్వాత మీరు పోటీ చేసే ఎన్నికల్లో గెలవాలంటే ఆ కార్యకర్తలే పనిచేయాలి. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని’ సీఎం సూచించారు.
‘ఈనెల 12 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలవుతుంది. ప్రతీ ఎమ్మెల్యే 50వేల సభ్యత్వాలు నమోదు చేయాలి. మార్చి 1 నుంచి పార్టీ కమిటీల నియామకం ప్రారంభించాలి. ఏప్రిల్‌లో పార్టీ భారీ బహిరంగసభ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండండి. విపక్షాలకు గట్టిగా కౌంటర్‌లు ఇవ్వాలని’ సీఎం వివరించారు.

About The Author