8 ఏళ్ల చిన్నారి గొంతు కోసి.. పళ్లు రాలగొట్టి..
అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యింది. మృగాళ్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడటమే కాక అత్యంత పాశవీకంగా హత్య చేశారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణం కోల్‌కతాలో చోటు చేసుకుంది. వివరాలు.. మూడవ తరగతి చదువుతోన్న ఎనిమిదేళ్ల చిన్నారి తన అమ్మమ్మను చూడటం కోసం వారి ఇంటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. దాంతో ఆమె కోసం గాలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో గురువారం చిన్నారి అమ్మమ్మ ఇంటికి సమీపంలోని ఓ పాడుపడిన బిల్డింగ్‌లో ఓ వ్యక్తి.. ఒంటి మీద సరైన బట్టలు లేకుండా.. గొంతు తెగి.. అత్యంత దారుణ స్థితిలో ఉన్న బాలికను గమనించాడు. దాంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఇంతలో బాలిక బంధువులు అక్కడికి వచ్చి.. చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఇక వైద్యుల నివేదికలో భయంకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఒక్కడు లేదా కొందరు కలిసి బాలిక మీద అత్యాచారం చేసి ఉంటారని నివేదిక వెల్లడించింది. బాధితుల నుంచి తప్పించుకునేందుకు బాలిక ఎంతో పెనుగులాడింది. దాంతో రాక్షసులు చిన్నారి జుట్టు పట్టుకుని ఇడ్చి.. కొట్టారు. రాయి లాంటి దానితో కొట్టడం వల్ల బాధితురాలి పళ్లు నాలుగు ఊడిపోయాయి. అకృత్యం ముగిసిన తర్వాత వారు ఆమె గొంతు కోశారు అని నివేదిక వెల్లడించింది. ఇక బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘బాలికకు తనపై దాడి చేసిన వారు ఎవరో తెలిసే ఉంటుంది. ఆమె బతికి ఉంటే.. తమను గుర్తు పడుతుందనే ఉద్దేశంతో నిందితులు బాలిక గొంతు కోసి చంపేశారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తాం’’ అని తెలిపారు. ఇక ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. రాష్ట్రంలో మహిళలకు ఎంత రక్షణ లభిస్తుందో దీనితో తెలుస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.