తల్లి, తండ్రి, అన్న పదానికే ఆ నీచులు అర్హురాలు కాదు..
తల్లి అన్న పదానికే ఆ నీచురాలు అర్హురాలు కాదు..
తండ్రి అన్న మాటకే ఆ నీచుడు అర్హుడు కాదు..
వీళ్ళిద్దరేకాదు .. అమ్మమ్మ , నాన్నమ్మ అందరూ కసాయివాళ్లే.. మనుషులు అన్నపడానికే కళంకంతెచ్చే రాక్షసులు.. అప్పుడే పుట్టిన బిడ్డ పాలకోసం ఏడుస్తుంటే పాలు ఇవ్వకుండా ఆకలికడుపుతోనే బిడ్డను పురిటిలోనే చంపాలని ప్రయత్నంచేసిన దారుణం మాతృత్వ మమకారానికే మచ్చ.. 10 వ కాన్పులో ఆడబిడ్డ పుట్టిందని వారు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ హృదయ విదారక ఘటనకు నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వాసుపత్రి వేదికైంది. నల్గొండ జిల్లా చందంపేట మండలం మోత్య తండాకు చెందిన ఇస్లావత్ సావిత్రి, రాజు దంపతులకు ఇప్పటికే ఆరుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. మంగళవారం ఉదయం సావిత్రి దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో పదో కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ మరుక్షణం నుంచే సంబంధీకులు వివక్షను ప్రదర్శించడం ఆరంభించారు. అమ్మమ్మ రాములమ్మ శిశువు వైపు కనీసం కన్నెత్తి చూడలేదు. బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తున్నా పాలు పట్టేందుకు తల్లి ముందుకు రాలేదు. ఇక తండ్రి సంగతి సరేసరి. ఇరుగుపొరుగు బాలింతలు, గర్భిణులు పాలు పట్టాలంటూ సూచించినా వాళ్లు చలించ లేదు. చివరికి వాళ్లే పోతపాలు పట్టి బిడ్డ ఆకలి తీర్చారు. ఇదంతా ఒక ఎత్తయితే గుట్టుచప్పుడు కాకుండా ఆడ శిశువును ఇతరులకు అప్పగించేందుకు దంపతులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారనే సమాచారంతో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ వెంకటమ్మ ఆసుపత్రికి చేరుకున్నారు. తల్లిదండ్రులతో మాట్లాడారు. శిశువుకు హాని తలపెట్టినా, శిశువు అదృశ్యమైనా మానవ అక్రమ రవాణా చట్టం కింద కేసు నమోదు చేస్తామని బిడ్డ తండ్రి రాజును హెచ్చరించారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేసు నమోదు చేసుకోండి. ఇంకా ఏమైనా చేసుకోండి’ అంటూ సూపర్‌వైజర్ వెంకటమ్మతో వాగ్వాదానికి దిగాడు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో బిడ్డను ఇంటికి తీసుకెళ్లేందుకు అంగీకరించాడు.