హైపర్ ఆదికి పోటీ వచ్చాడోచ్…
జబర్దస్త్‌లో పంచ్‌డైలాగ్‌లు వేస్తూ హైపర్ ఆది పాపులర్ అయ్యాడు. ఒక్కోసారి అతని డైలాగ్‌లు బూతులతో శృతిమించి …హాస్యం కాస్త వికటించిన సందర్భాలు కూడా లేకపోలేదు. కానీ అతనికంటూ ప్రత్యేక అభిమానులున్నారనేది వాస్తవం. తాజాగా ఓ సరికొత్త డైలాగ్‌రైటర్ అవతరించారు. ఆయన హాస్యభరిత డైలాగ్‌లు చూస్తా ఉంటే హైపర్ ఆదిని మించిపోయేలా ఉన్నారు.
ఇంతకూ ఆయనెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పోకిరి సినిమాలో మహేశ్ చెప్పే పాపులర్ డైలాగ్ “ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు..” అన్నట్టు “రాజకీయాల్లో పచ్చి అబద్ధాలను కూడా నిజాలుగా నమ్మించే విద్యలో ఎవరు ఆరితేరారో ఆయనే చంద్రబాబు” అని చెప్పుకోవాల్సి వచ్చింది.
అమరావతిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు వింటే ….నవ్వు ఆపుకోవడం సాధ్యం కాదు. అందుకే నవ్వించడంలో ఆయన హైపర్ ఆదిని మించిపోయారని చెప్పడం. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా వెలువడిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది అని బాబు అన్న మాటలు వింటే నవ్వు గాక ఎవరికైనా ఏమొస్తుంది?
తన పాలిట భగవద్గీతగా అభివర్ణించిన పత్రికలో కనీసం ఏ పార్టీ మద్దతుతో గెలిచారో కూడా రాయలేని దుస్థితి ఎందుకొచ్చిందో ఒకసారి రాజగురువు రామోజీని అడిగితే చెబుతారు. టీడీపీ మద్దతుదారులు ఇదే విజయాన్ని సాధించి ఉంటే …సదరు రాజగురువు పత్రిక తాటికాయంత అక్షరాలతో రాయకపోయి ఉండేదా?
ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వాళ్లకు పతనం ప్రారంభమైనట్టా? లేక నామమాత్రంగా కూడా పోటీ ఇవ్వలేని పార్టీ పతనమవుతున్నట్టా? 40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ అని గొప్పగా చెప్పుకునే శ్రీమాన్ చంద్రబాబు గారే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
చెప్పేవారికి వినేవాళ్లు లోకువ అంటే ఎలాగో …చంద్రబాబే ఉదాహరణ. తానేం చెప్పినా చూపే చానళ్లు, రాసే పత్రికలు ఉన్నాయనే భరోసాతో సంబంధం లేని విజయాలను తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకే చెల్లింది.
రాజ్యాంగ వ్యవస్థలన్నీ దెబ్బతీసే పరిస్థితికి వైసీపీ ప్రభుత్వం వచ్చిందని చంద్రబాబు ఆరోపించడం కంటే కామెడీ మరేదైనా ఉంటుందా? తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో ఉందని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎన్ని దుర్మార్గాలు చేసినా ప్రజలు అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్పారని బాబు అన్నారు. 38.74 శాతం ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చాయని చంద్రబాబు చెప్పడం గమనార్హం.
టీడీపీ ప్రజల గుండెల్లో ఉంటే గత సార్వత్రిక ఎన్నికల్లో అంత ఘోరంగా ఎందుకు ఓడించారో ఈ 20 నెలల్లో కనీసం ఒక్కసారైనా చంద్రబాబు అంతరాత్మకైనా సమాధానం చెప్పుకున్నారా? ఘోర పరాజయం బాబు గుండెల్లో రగిల్చిన చిచ్చు ఎప్పటికీ ఆరదు. అధికార పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం అంటే గత సార్వత్రిక ఎన్నికల్లో 23 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాలకు పరిమితం చేశారు చూడు… అలాగన్న మాట చంద్రబాబు గారూ.
మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించినట్టు …. ఇంతకూ ఆ 38.74 శాతం ఫలితాలు ఏ రాష్ట్రం నుంచి తీసుకొచ్చారో కాస్త చెప్పరా? మరీ హాస్యం ఎక్కువైనా అపహాస్యమవుతారనే విషయాన్ని గ్రహించండి చంద్రబాబు. ఇదిగో హైపర్ ఆది … ఇంతకాలం నాకు ఎదురే లేదని భావించావు కదూ! తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడని ఎపుడైనా విన్నావా? పోనీలే వినకపోయినా నష్టం లేదు. ఇప్పుడు నేరుగా చంద్రబాబును చూస్తే సరిపోతుందిలే. అంతేగా మరి!