పవన్ కి క్లారిటీ ఉంది.. అందుకే జగన్ పై పడ్డారు


డైరెక్ట్ గా ధనుష్ టు పెదరాయుడు, పెదరాయుడు టు ధనుష్ అని డైలాగులు కొట్టారు జనసేన నాయకులు. పవన్ నేరుగా ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీని కలసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కోరతారని టముకేసుకున్నారు. ఆ మేరకు ప్రెస్ నోట్ల హడావిడి బాగానే జరిగింది.
పవన్ ఢిల్లీ వెళ్లగానే ఆయనకు రెడ్ కార్పెట్ పరుస్తారని, ఆయన విశ్లేషణ, వివరణ విన్న వెంటనే కేంద్రం ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గుతుందని తెగ బిల్డప్ ఇచ్చారు. కట్ చేస్తే, రెండు రోజులుగా ఆయనకు పీఎం అపాయింట్ మెంట్ దొరకలేదు. అందుకే అమిత్ షా, కిషన్ రెడ్డి ని కలుస్తూ ఎక్కే గడప, దిగే గడప అంటూ రోజులు గడుపుతున్నారు పవన్.
తీరా మోదీని కలవకుండానే పవన్ ఏపీకి వస్తారనే వార్తలు వినపడుతున్న నేపథ్యంలో, కేంద్ర మంత్రులెవరూ కనీసం జనసేన విన్నపాలను పరిశీలిస్తామనే హామీ కూడా ఇవ్వని దారుణ పరిస్థితుల్లో.. ఊహించినట్టుగానే పవన్, జగన్ ని టార్గెట్ చేశారు.
ఒక్క ప్రజా ప్రతినిధి కూడా లేని జనసేన ఇంత కష్టపడుతుంటే.. 22మంది ఎంపీలున్న వైసీపీ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇంకెంత చేయాలంటూ పంచ్ డైలాగులు కొట్టారు. అసలు తప్పంతా జగన్ దేనంటూ విమర్శలు గుప్పించారు. విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
ఆడలేక మద్దెల ఓడన్నట్టు..
పవన్ కల్యాణ్ కి ఢిల్లీలో పసలేదనే విషయం మరోసారి రుజువైంది. రెండురోజులైనా పీఎం అపాయింట్ మెంట్ దొరకలేదు. తాను కలసిన నాయకులెవరూ మీడియా ముందుకొచ్చి మాట్లాడలేదు, కనీసం తనకి కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదు.
ఆ మాత్రం బిల్డప్ ఇచ్చేందుకు ఢిల్లీ వరకు వెళ్లి లెటర్లు ఇస్తూ ఫొటోలకు ఫోజులివ్వాలా..? ప్రధానికి లేఖ రాసి సరిపెడతారా అంటూ సీఎం జగన్ ని ప్రశ్నిస్తున్న పవన్, ఢిల్లీ వెళ్లి సాధించిందేంటి? పోనీ ఏమైనా సాధిస్తారన్న ఆశ ఉందా? అది లేదు కాబట్టే నెపం వైసీపీపైకి నెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తన గురువు చంద్రబాబు చూపెట్టిన దారిలో వెళ్లడానికి డిసైడ్ అయ్యారు పవన్.
కేంద్రం ఎలాగూ మెత్తబడే అవకాశం లేదు కాబట్టి.. ఏదో తూతూ మంత్రంగా నిరసనలతో మమ అనిపించి, చివరకు వైసీపీ వల్లే ఈ తప్పు జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం మెత్తగా ఉండటం వల్లే విశాఖ ఉక్కు ప్రైవేటుపరం అయిందని స్టేట్ మెంట్లిచ్చేస్తారు చంద్రబాబు, పవన్. వారిద్దరికీ పిక్చర్ క్లారిటీ రావడం వల్లే జగన్ ని టార్గెట్ చేస్తున్నారు. పవన్ వ్యవహారం చూస్తుంటే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై నోరుమెదిపే అవకాశమే లేదని అర్థమవుతోంది.
తిరుపతిపై ఆశలు లేనట్టే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డు పెట్టుకుని తిరుపతి సీటు విషయంలో డిమాండ్లు వినిపిద్దామనుకున్న పవన్ కి మరోసారి చుక్కెదురైనట్టు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికలపై జనసేన-బీజేపీ కోర్ కమిటీ చర్చిస్తుందని సెలవిచ్చారే కానీ ఆ స్థానంలో జనసేన పోటీ చేసే అవకాశం ఉందని ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నారు.
రాగా పోగా పవన్ చెప్పిన కొత్త విషయం ఏంటంటే.. మార్చి 3, 4 తేదీల్లో అమిత్ షా తిరుపతి పర్యటన. దీనిపై అధికారిక ప్రకటన రావడానికి ముందే పవన్ ప్రకటన ఇచ్చేశారు. పవన్ వ్యాఖ్యల్ని చూస్తే.. దాదాపుగా ఆయన తిరుపతిపై ఆశలు వదిలేసుకున్నారని అర్థమవుతోంది.

About The Author