నా విడాకులకు సినిమాలే కారణం – మాజీ హీరో


సినిమాలతో బాగుపడిన వాళ్లున్నారు. క్రేజ్-డబ్బు సంపాదించుకున్న వాళ్లు చాలామంది. అయితే ఓ నటుడు మాత్రం తన వైవాహిక జీవితం నాశనం అవ్వడానికి కారణం సినిమాలని తేల్చిచెబుతున్నాడు. తను భార్యతో విడిపోవడానికి కారణం సినిమాలే అంటున్నాడు. అతడే నటుడు సురేష్.
ఒకప్పుడు హీరోగా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన సురేశ్.. భార్యకు విడాకులిచ్చాడనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఎట్టకేలకు తన విడాకులపై సురేష్ రియాక్ట్ అయ్యాడు.
“నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తను నాతో పాటు ఓ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మంచి గాయని కూడా. ఆ టైమ్ లో మేమిద్దరం స్ట్రగుల్ లో ఉన్నాం. తనకు సినిమాలంటే ఇష్టం లేదు. బాగా చదువుకొని అమెరికా వెళ్లిపోదామంది. అప్పటికి ఇండస్ట్రీలో నా పరిస్థితి కూడా బాగాలేదు. సరే అన్నాను. అలా ఓ కండిషన్ తో మేమిద్దరం ఒక్కటయ్యాం.”
అయితే ఊహించని విధంగా పెళ్లి తర్వాత సురేష్ సినిమాల్లో బిజీ అయిపోయాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుసపెట్టి సినిమాలు చేశాడు. ఒక టైమ్ లో ఏడాదిలో 18 సినిమాల్లో కూడా నటించాడు. పొద్దున్న లేస్తే స్టోరీ డిస్కషన్లు, తర్వాత షూటింగ్, మళ్లీ స్టోరీ డిస్కషన్ ఇలా సాగిపోయింది. అప్పుడే తన నిర్ణయంపై పునఃసమీక్షించుకోమని భార్యను కోరాడు సురేష్.
“నా భార్యకు మాత్రం నా సినిమా లైఫ్ నచ్చలేదు. కాంప్రమైజ్ కాలేవా అని అడిగాను. కుదరదు అంది. తను చెన్నైలో చదువు స్టార్ట్ చేసింది. వేరే దారి ఎంచుకుంది. తల్లిదండ్రుల పట్టుదల వల్ల పిల్లాడ్ని కన్నాం. బిడ్డ పుడితే పరిస్థితులు మారతాయని అనుకున్నాం. కానీ కుదర్లేదు. దీంతో ఇద్దరం కలిసి విడాకులకు అప్లై చేశాం.”
అలా తన భార్యతో విడిపోయిన విషయాన్ని బయటపెట్టాడు సురేష్. వైవాహికంగా విడిపోయినా తన భార్య, తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు ఈ నటుడు. పైగా ఇప్పుడు తన రెండో భార్య, విడాకులిచ్చిన మొదటి భార్య కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారని చెబుతున్నాడు.

About The Author