‘డేటింగ్‌ ట్రాప్‌’ ముంబై వ్యక్తి పనే..


నగరానికి చెందిన బాలికకు డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమై, వేధింపులకు పాల్పడిన వ్యక్తి ముంబైకి చెందిన అమీర్‌ అహ్మద్‌ ఖాన్‌గా సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తేల్చారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం శుక్రవారం అతడిని అరెస్టు చేసి సిటీకి తీసుకువచ్చింది. నగరానికి చెందిన బాలిక (14) డేటింగ్‌ యాప్‌ను తన సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంది. దాని ద్వారా ఆమె అనేక మందితో చాటింగ్‌ చేసింది. ఈ నేపథ్యంలో అమీర్‌ అహ్మద్‌ ఖాన్‌తో సదరు బాలికకు పరిచయం ఏర్పడింది. అక్కడి ఓ చెప్పుల కంపెనీలో పని చేసే ఇతగాడు నిత్యం వివిధ యాప్స్‌ ద్వారా అనేక మందికి ఎర వేస్తుంటాడు. ఇదే తరహాలో నగర బాలికతో పరిచయం పెంచుకున్న ఖాన్‌ తొలినాళ్లల్లోస్నేహపూర్వకంగా మాట్లాడుతూ ట్రాప్‌ చేశాడు. ఆపై ఆమెను ఆన్‌లైన్‌ అశ్లీలం ముగ్గులోకి దింపాడు. ఆమెతో వీడియో కాల్స్‌ కూడా చేయించుకున్న అతగాడు ఓ సందర్భంలో వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సంగ్రహించాడు. ఆపై అసలు కథ మొదలెట్టిన నిందితుడు తక్షణం బయలుదేరి ముంబై రావాలని, లేదంటే ఆ ఫొటోలు, వీడియోలు ఇంటర్‌నెట్‌లో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. ఓ దశలో ఆమె జీమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ సైతం తీసుకుని కాంటాక్ట్స్‌ను తన ఆదీనంలోకి తీసుకున్నాడు. అతడి బెదిరింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలిపింది. దీంతో వారు సోమవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ ప్రశాంత్, ఎస్సై తిరుమలేష్‌లతో కూడిన బృందం ఈ కేసు దర్యాప్తు చేసింది. ఐపీ అడ్రస్‌ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి తీసుకువచ్చింది. మరోపక్క ఓఎల్‌ఎక్స్‌లో తక్కువ ధరకే ద్విచక్ర వాహనం విక్రయిస్తున్నట్లు ప్రకటన ఇచి్చన సైబర్‌ నేరగాళ్లు ఓ ఆర్మీ జవాన్‌కు టోకరా వేశారు. ఈయన నుంచి వివిధ చార్జీల పేరుతో రూ.3.2 లక్షలు కాజేశారు.

About The Author