60 ఏళ్ళ వయసులో ప్రేమ, ఆమె గుండె తలుపు తట్టింది..ఇది అద్భుత ప్రేమకథ ..
నేటి స్పీడ్ యుగంలో 14 ఏళ్ళకే ప్రేమ, 18 ఏళ్ళకే పెళ్ళి… ప్రేమలు విఫలమైతే ఆత్మహత్యలు.. ప్రేమ పేరుతో సెల్ఫీలు, అసభ్య వీడియోలు, అవి వికటిస్తే ఆత్మహత్యలు. ప్రేమకు సరైన నిర్వచనం చెప్పలేని కాలమిది. సోషల్ మీడియా ముసుగేసుకున్న కృత్రిమ ప్రేమ. అయితే 60 ఏళ్ళకు ప్రేమ, ఓ గుండె తలుపు తట్టింది. మగాడంటేనే వ్యతిరేకత, పెళ్ళి అంటేనే ఏవగింపుతో ఉన్న ఓ ప్రముఖ నటి 60 ఏళ్ళ వరకు అవివాహితగానే ఉండి, షష్టిపూర్తి దాటిన తర్వాత ఆమె నిజమైన ప్రేమలో పడింది.
70 ఏళ్ళ వయసులో ఇప్పుడు కూడా తనను ప్రేమించిన ప్రియుడి ప్రేమ మాధుర్యంలో మునిగి తేలుతోంది. ఆమె ఎవరో కాదు సుహాసినీ మూలే. మరాఠీ, హిందీ, అస్సామీ చిత్రరంగాల్లో ప్రముఖ నటి. నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా అందుకుంది. సుహాసినీ మూలే 2011లో 60 ఏళ్ళు దగ్గర పడిన సమయంలో ప్రేమలో పడింది. అప్పటివరకు ఫేస్ బుక్ అకౌంట్ కూడా లేని మూలేకి, ఆమె స్నేహితురాలు ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేయమంటూ, తనే అకౌంట్ క్రియేట్ చేసింది. ఫేస్ బుక్ లో ఆమెతో ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త అతుల్ గుర్తు పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది.
అప్పటికే అతుల్ గుర్తు భార్య చనిపోయింది. ఓ సందర్భంలో అతుల్ గుర్తు మూలే మొబైల్ నెంబర్ అడిగితే ఆమె నిరాకరించింది. తాను ప్రముఖ శాస్త్రవేత్త అని, ఆకతాయిని కాదని చెప్పడంతో వెబ్ సైట్ లో ఆయన వివరాలు చెక్ చేసి ఫోన్ నెంబర్ ఇచ్చింది. మాటలు కలిసి మనసులు కలిశాయి. 60 ఏళ్ళు బ్రహ్మచారిణిగానే ఉన్న సుహాసినీ మూలే, 60వ సంవత్సరంలో ప్రేమలో పడింది. తన ప్రేమ కధను వాలెంటైన్స్ డే సందర్భంగా అందరితో పంచుకుంది. నేటి కలుషిత ప్రేమల గంజాయి వనంలో వీరిద్దరి ప్రేమ తులసి మొక్క లాంటిది.