మే 23న కూతురి పెళ్లి.. అంతలోనే జలసమాధి


దైవ దర్శనానికి వేకువజామునే సొంతూరుకు బయల్దేరిన ఓ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించినా తేరుకునే లోపే మృత్యువు కాటేసింది. నీట మునిగి ముగ్గురు కుటుంబసభ్యులు దుర్మరణం చెందారు. ‘‘అమ్మకు ఈత రాదు. అమ్మను తీసుకొని బయటకు వెళ్దాం..’’అని తండ్రి ధైర్యం చెప్పినా… తేరుకొని బయటపడే ప్రయత్నం చేసే లోపే కారులో నీరు నిండిపోయింది. దంపతులు, కూతురు దుర్మరణం చెందగా… కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట శివారులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డుకు చెందిన న్యాయవాది కటికనేని అమరేందర్‌రావు (55), ఆయన భార్య శిరీష (45), కూతురు శ్రేయ (23), కుమారుడు జయంత్‌ కలిసి సోమవారం స్వగ్రామమైన కోరుట్ల మండలం జోగన్‌ పెల్లికి బయల్దేరారు. ఊరిలో సోమవారమే ప్రారంభమైన వేంకటేశ్వరస్వామి ఉత్సవా లకు హాజరయ్యేందుకు తెల్లవారుజామున 5.15 గంటలకు బయల్దేరారు. ఆ తర్వాత 15 నిమిషాలకే కారు అదుపుతప్పి మేడిపల్లి మండలం కట్లకుంట శివారులో రోడ్డు పక్కనున్న ఎస్సారెస్పీ కాలువలో పడిపోయింది.
ఆ సమయంలో అమరేందర్‌రావు కారు నడుపుతుండగా, కుమారుడు జయంత్‌ పక్కన కూర్చున్నాడు. భార్య శిరీష, కూతురు శ్రేయ వెనుక సీట్లో కూర్చున్నారు. కారు కాలువలో పడి సుమారు 20 మీటర్ల దూరం వరకు వెళ్లి మోటారు పైపునకు తట్టుకుని ఆగింది. కుమారుడు జయంత్‌ కారు డోరు తీసు కుని… ఈదుకుంటూ సురక్షితంగా బయట పడినప్పటికీ అమరేందర్‌రావుతో పాటు భార్య శిరీష, కూతురు శ్రేయ కారులో ఇరు క్కుపోవడంతో నీటిలోనే మునిగి మరణిం చారు. స్థానికులు సహాయ చర్యలు చేపట్టినప్పటికీ అప్పటికే ముగ్గురు చనిపోయారు.

About The Author