షేక్‌పేట తహసీల్దార్.. బదిలీ రగడ!
నగరంలో షేక్‌పేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక బదిలీపై రగడ రగులుకుంటోంది. తాజాగా మాజీ మంత్రి దానం నాగేందర్ వ్యాఖ్యలతో దీనికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఇప్పటికే రాజకీయ ఒత్తిళ్లతోనే బదిలీ జరిగిందని ఆరోపిస్తూ రెవెన్యూ ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆందోళనకు బలం చేకూర్చినట్లయింది. బంజారాహిల్స్ కార్పొరేటర్ విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్‌గా ఎన్నికైన మరుసటి రోజు షేక్‌పేట తహసీల్దార్‌కు స్థానచలనం కలిగించడం సర్వత్రా చర్చనీయంశంగా మారింది.
అసలేం జరిగిందంటే..
సరిగ్గా పక్షం రోజుల క్రితం జనవరి 20న ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జరుగతున్న నిర్లక్ష్యం..జాప్యంపై ప్రశ్నించేందుకు బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి తన అనుచరులతో కలిసి షేక్‌పేట తహసీల్ ఆఫీస్‌కు వెళ్లారు. ఈనేపథ్యంలో ఎమ్మార్వో శ్రీనివాస్‌రెడ్డి..కార్పొరేటర్ విజయలక్ష్మి మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో షేక్‌పేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ విజయలక్ష్మి ఒకరిపై మరొకరు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఇదిలా ఉండగా ఈ నెల 11న కార్పొరేటర్ విజయలక్ష్మి జీహెచ్‌ఎంసీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికైన 72 గంటల్లోనే శ్రీనివాస్‌రెడ్డిపై బదిలీ వేటు వేస్తూ సీసీఎల్‌ఏలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ముఖ్యకార్యదర్శి సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎస్‌కు ఫిర్యాదు చేశాం: దానం నాగేందర్
షేక్‌పేట తహసీల్దార్‌పై ఎంపీ కేశవరావుతో కలిసి సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు. ప్రజాప్రతినిధులంటే తహసీల్దార్‌కు గౌరవం లేదన్నారు. ఆదాయ, కులదృవీకరణ పత్రాల జారీలో నిర్లక్ష్యం వహించడం వల్లనే సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
అండగా ఉద్యోగ సంఘాలు
రెవెన్యూ ఉద్యోగ సంఘాలు తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డికి అండగా నిలబడ్డాయి. రాజకీయ జోక్యంతోనే బదిలీ జరిగిందని ఆరోపిస్తూన్నాయి. ఏకంగా మీడియా ముందుకు వచ్చి గళం విప్పుతున్నాయి. దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన మాజీ ఎంపీ కె.కేశవరావు కుమార్తె, అమెరికాలో ఉన్నత ఉద్యోగం సైతం వదిలి ప్రజా సేవకు వచ్చిన ఆమె.. ఇటువంటి చిన్న చిన్న విషయాల కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాయి.
అధికారికంగా ఉత్తర్వులు అందలేదు: శ్రీనివాస్ రెడ్డి
ఇంకా అధికారికంగా తనకు బదిలీ ఉత్తర్వులు అందలేదని షేక్‌పేట మండల తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు బదిలీలు జరగడం సాధారణమేనని, తన బదిలీ కూడా అలా జరిగే ఉంటుందని భావిస్తున్నానన్నారు. తనను ఎందుకు బదిలీ చేశారో తెలియదన్నారు. కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి ముందుగా తనపైనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, ఆ తర్వాతే తాను కౌంటర్ పిటిషన్ వేశానన్నారు. ఆదాయ «ధృవీకరణ పత్రం కోసం ఆమె ఫోన్‌చేశారని, తన వద్ద వీఆర్‌వోలు లేరన్న విషయాన్ని చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. ఆ కొద్దిసేపటికే ఆఫీస్‌కు వచ్చారని, ఆ సమయంలో కోర్టుకు వెళ్లాల్సి ఉండగా కేసును స్టడీ చేస్తున్నానని వెల్లడించారు. నిబంధనల ప్రకారమే తాను నడుచుకున్నానన్నారు.