మేయర్ వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్
‘వానల్లు రావాలి వానదేవుడా.. చేలన్నీ పండాలి వానదేవుడా’ అని చిన్నప్పుడు చాలామంది పాడుకొని ఉండొచ్చు. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి మాత్రం ‘వానల్లు రావొద్దు వానదేవుడా..ఐదేళ్లు రావద్దు వానదేవుడా ’ అని కోరుకుంటున్నారు. ఇటీవలి వానలకు నగరం అతలాకుతలం అయిన పరిస్థితిని గుర్తుచేస్తూ ఒక చానెల్ ప్రతినిధి, భారీ వర్షాలు కురిస్తే ఆపదలు తలెత్తకుండా ప్రజలకు ఎలాంటి భరోసానిస్తారని ప్రశ్నించగా బదులిస్తూ విజయలక్ష్మి , ‘ఫస్ట్ థింగ్ నేను దేవుణ్ని మొక్కుకుంటాను. ఈ ఐదేళ్లు వర్షాలు అవీ రాకూడదని’ వ్యాఖ్యానించారు.దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా విస్తుపోయారు. మేయర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం, జీహెచ్ఎంసీ చేయాల్సినవన్నీ చేస్తున్నా ప్రజలు కూడా ఆలోచించాలని మేయర్ కోరారు. గతంలో జరిగిన నాలాల ఆక్రమణల వల్ల కాలనీలు, ఇళ్లు మునుగుతున్నాయన్నారు. అందువల్ల ఇప్పుడు వెళ్లి తాను ఇళ్లను కూల్చలేనని కూడా స్పష్టం చేశారు. ఒక ప్రజాప్రతినిధిగా తాను ఆ పని చేయలేనని చెప్పారు. చెప్పగలిగేదేమిటంటే ముందస్తుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది తన అభిప్రాయమన్నారు.