న్యాయవాద దంపతుల దారుణ హత్య
పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మంథనికి చెందిన హైకోర్టు న్యాయవాదులు గట్టు నాగమణి, వామన్ రావు దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ నుంచి మంథనికి వెళ్తుండగా రామగిరి వద్ద బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. న్యాయవాది గట్టు వామన్ రావు వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడి దంపతుల ఇద్దరినీ దారుణంగా నరికి హత్య చేశారు. వేట కొడవళ్లు, కత్తులతో దాడి చేశారని ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు న్యాయవాది వాగ్మూలం ఇచ్చారు. గుంజపడుగుకు చెందిన కుంట శ్రీనివాస్ తమపై దాడి చేసినట్లు తెలిపారు.పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కొంతకాలం నుంచి వివాదాస్పద విషయాల్లో వామన్‌రావు జోక్యం చేసుకుంటున్నారని, ఈ క్రమంలోనే కుంటు శ్రీనివాస్ పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డారని న్యాయవాది సమీప వ్యక్తుల ద్వారా తెలుస్తోంది. అయితే వివాదం మరింత ముదరడంతో ఈ హత్యకు పాల్పడ్డారని చెబుతున్నారు. హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న కుంట శ్రీనివాస్ టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడిగా బాధ్యతల్లో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.